గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎన్నో తెలుగు చిత్రాలు వచ్చాయి. గోదావరి నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, ప్రేమకథలు వచ్చాయి. యాక్షన్ చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా 'శశివదనే' కూడా గోదావరి నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమే. ఇది తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా అని నిర్మాత అహితేజ బెల్లంకొండ అంటున్నారు.


రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'శశివదనే'. ఇందులో కోమలీ ప్రసాద్ కథానాయిక. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సంగీత దర్శకుడు - నటుడిగా మారిన రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ (ఆచంట) ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. ఇటీవల సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.


'శశివదనే' ఫస్ట్ షెడ్యూల్‌ను అమలాపురంలో షూటింగ్ చేశారు. సుమారు 30 శాతం సినిమా పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ "ఫ‌స్ట్ షెడ్యూల్‌లో రెండు మాంటేజ్ సాంగ్స్, లవ్ సీన్స్ తీశాం. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో రఘు కుంచె, శ్రీమాన్, 'రంగస్థలం' మహేష్ కూడా షూటింగ్ చేస్తారు. గోదావరి నేపథ్యంలో తీస్తున్న తొలి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఇది. సీన్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. మా డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిస్తున్నారు. విజువల్స్, మ్యూజిక్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉంటాయి" అని అన్నారు.