ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో పదో జట్టు పేరు తెలిసిపోయింది. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ అధికారికంగా తమ జట్టు పేరు ప్రకటించింది. 'గుజరాత్‌ టైటాన్స్‌'గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించింది. 'శుభారంభం.. గుజరాత్‌ టైటాన్స్‌' అంటూ తమ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది.


సీవీసీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసిన కొత్త ఫ్రాంచైజీ సొంత మైదానం అహ్మదాబాద్‌. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ఇక్కడే ఉంది కాబట్టి నగరం పేరే పెడతారని అనుకున్నారు. 'అహ్మదాబాద్‌ టైటాన్స్‌'గా నామకరణం చేయబోతున్నారని మంగళవారం వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో అదే పేరు ట్రెండ్‌ అయింది.


తాజాగా తమ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ తమ పేరును 'గుజరాత్‌ టైటాన్స్‌'గా ప్రకటించింది. ఈ జట్టు హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది! అతడు బరోడా కుర్రాడు కావడమే ఇందుకు కారణం. పైగా లోకల్‌ సెంటిమెంట్‌ లభిస్తుంది. అతడితో పాటు అఫ్గాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ను తీసుకుంది. పాండ్య, రషీద్‌కు చెరో రూ.15 కోట్లు చెల్లి్స్తుండగా శుభ్‌మన్‌కు రూ.8 కోట్లు ఇస్తున్నారు.


ఇన్నాళ్లూ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్‌ జరిగే సంగతి . ఈ సీజన్‌ నుంచి పది జట్లు ఉండబోతున్నాయి. మూడు నెలల క్రితమే రెండు కొత్త జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్‌, లక్నో ఫ్రాంచైజీని ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ దక్కించుకున్నాయి. ఇందుకోసం ఆ రెండు కంపెనీలు దాదాపుగా రూ.12వేల కోట్ల వరకు ఖర్చుచేశాయి.


Also Read: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్‌ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?


Also Read: టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఓకే! త్వరలోనే సెలక్షన్‌ కమిటీ ప్రకటన