కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ ఖాయం చేసుకుంది. 16 పాయింట్లతో తన స్థానం మరింత పటిష్ఠంగా మార్చుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. 165 పరుగుల లక్ష్యాన్ని రక్షించుకుంది. ఛేదనలో పంజాబ్‌కు కేఎల్‌ రాహుల్‌ (39; 35 బంతుల్లో 1x4, 2x6 ), మయాంక్ అగర్వాల్‌ (57; 42 బంతుల్లో 6x4, 2x6) అద్భుతమైన ఓపెనింగ్‌ ఇచ్చారు. అంతకు ముందు బెంగళూరులో మాక్స్‌వెల్‌ (57; 33 బంతుల్లో 3x4, 4x6), దేవదత్‌ పడిక్కల్‌ (40; 38 బంతుల్లో 4x4, 2x6) రాణించారు.


Also Read: చెన్నైపై ఆరు వికెట్లతో రాజస్తాన్ విజయం.. పాపం గైక్వాడ్.. సెంచరీ వృథా!


ఓపెనర్లు ఉన్నంత వరకే..!
పరిస్థితులు భిన్నంగా ఉన్నా ఛేదనను పంజాబ్‌ బాగానే ఆరంభించింది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ కళ్లుచెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదేశారు. పవర్‌ప్లేలో 49 పరుగులు అందించారు. 10 ఓవర్లకు జట్టును 81-0తో బలంగా నిలిపారు. జట్టు స్కోరు 91 వద్ద రాహుల్‌ను షాబాజ్‌ ఔట్‌ చేసినా మయాంక్‌ 36 బంతుల్లో అర్ధశతకం అందుకోవడంతో అంతా సవ్యంగానే అనిపించింది. స్పిన్నర్లు పరుగుల్ని నియంత్రించడం.. నికోలస్‌ పూరన్‌ (3) ఔటవ్వడంతో మయాంక్‌పై ఒత్తిడి పెరిగింది. జట్టు స్కోరు 114 వద్ద అతడిని చాహల్‌ బోల్తా కొట్టించడంతో పంజాబ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. మార్‌క్రమ్‌ (20), షారుక్‌ (16) ఒకట్రెండు షాట్లు ఆడినా చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగింది. ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా పంజాబ్‌ 12 పరుగులే చేసి 158-6కు పరిమితమైంది.


Also Read: పతకాల పంట సాధించిన భారతీయ షూటర్లు.. అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి!


రక్షించిన మాక్సీ
బెంగళూరు ఇన్నింగ్స్‌ రెండు దశలుగా సాగింది. నెమ్మది పిచ్‌పై వారికి అదిరే ఆరంభం దొరికింది. వేగం తగ్గించకుండా బంతులు వేయడంతో ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ పంజాబ్‌ పేసర్లను ఉతికారేశారు. పవర్‌ప్లే ముగిసే సరికే 55 పరుగులు చేశారు. వికెట్‌ కోసం ఎదురు చూస్తున్న రాహుల్‌ సేనకు హెన్రిక్స్‌ అండగా నిలిచాడు. 68 వద్ద కోహ్లీ, క్రిస్టియన్ (0), 73 వద్ద పడిక్కల్‌ను ఔట్‌ చేశాడు. ఈక్రమంలో మాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌ (23) దుమ్మురేపారు. పంజాబ్‌ స్పిన్నర్లు పరుగులు ఇవ్వకున్నా మాక్సీ స్విచ్‌హిట్‌, స్లాగ్‌స్వీప్‌తో సిక్సర్లు బాదేశాడు. 29 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. నాలుగో వికెట్‌కు 73 (39 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించాడు.  18.3 ఓవర్లకు స్కోరును 150కి చేర్చాడు. ఆఖరి ఓవర్లో షమి.. మాక్సీ, షాబాజ్‌ (8), గార్టన్‌ (0)ను ఔట్‌ చేయడంతో స్కోరు 164/7కు చేరింది.


Also Read: తెల్లబంతి క్రికెట్లో ఎంఎస్‌ ధోనీ 'ది కింగ్‌ కాంగ్‌'! అతడు సాధించనిది ఏముందన్న రవిశాస్త్రి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి