ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. రుతురాజ్ గైక్వాడ్ (101 నాటౌట్: 60 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీకి తోడు, జడేజా (32 నాటౌట్: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 189 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (27: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (50: 21 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో మొదటి ఐదు ఓవర్లలోనే 75 పరుగులు సాధించింది. ఆ తర్వాత శివం దూబే (64: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), సంజు శామ్సన్ (28: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఆ వేగం తగ్గకుండా చూడటంతో రాజస్తాన్ 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.


Also Read: ముంబయి.. ప్లీజ్‌ ఓడిపోవా! ప్లేఆఫ్స్‌ కోసం పంజాబ్‌, కోల్‌కతా కోరికలు!


రుతురాజ్ షో..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి చెప్పుకోదగ్గ ప్రారంభం లభించింది. ఓపెనర్లు ఫాఫ్ డుఫ్లెసిస్ (25: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (101 నాటౌట్: 60 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు) రాజస్తాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యంతో ఆడారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. అయితే రాహుల్ టెవాటియా.. చెన్నైని గట్టి దెబ్బ కొట్టాడు. డుఫ్లెసిస్, సురేష్ రైనా(3: 5 బంతుల్లో)లను వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్లు నష్టపోయి 63 పరుగులు చేసింది.


ఆ తర్వాత మొయిన్ అలీ (25: 19 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), గైక్వాడ్ గేర్ మార్చారు. వీరు వేగంగా ఆడుతూ 14 ఓవర్లలో జట్టు స్కోరు 100 పరుగులకు చేర్చారు. అయితే తర్వాతి ఓవర్లో మొయిన్ అలీ అవుటయ్యాడు. తన స్థానంలో వచ్చిన రాయుడు (2: 4 బంతుల్లో) క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద గ్లెన్ ఫిలిప్స్‌కు చిక్కాడు. అయితే ఆ తర్వాత రాజస్తాన్ కష్టాలు రెట్టింపయ్యాయి. రవీంద్ర జడేజా (32 నాటౌట్: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్‌కు 22 బంతుల్లోనే ఏకంగా 65 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి రుతురాజ్ గైక్వాడ్ తన మొదటి ఐపీఎల్ సెంచరీని సాధించాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 189 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో కేవలం 63 పరుగుల మాత్రమే చెన్నై.. చివరి 10 ఓవర్లలో ఏకంగా 126 పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో రాహుల్ టెవాటియా మూడు వికెట్లు తీయగా.. చేతన్ సకారియాకు ఒక వికెట్ దక్కింది.


అదిరిపోయే ఆరంభం
ఛేదనలో రాజస్తాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (27: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (50: 21 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో రాజస్తాన్ మొదటి ఐదు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 75 పరుగులు సాధించింది. అయితే తర్వాత వరుస ఓవర్లలోనే వీరిద్దరూ అవుటయ్యారు. అయితే ఆ తర్వాత సంజు శామ్సన్ (28: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు), శివం దూబే (64: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రాజస్తాన్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.


ఆ తర్వాత కూడా వీరిద్దరూ అస్సలు తగ్గకపోవడంతో 12.4 ఓవర్లలోనే రాజస్తాన్ 150 పరుగుల మార్కును చేరుకుంది. విజయానికి కాస్త ముందు శామ్సన్ అవుటైనా.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి శివం దూబే 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. కేఎం ఆసిఫ్ ఒక వికెట్ తీశారు.


Also Read: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..


Also Read: అందం క్రికెట్‌ ఆడితే...! ఆమెను స్మృతి మంధాన అంటారు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి