రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై అద్భుతమైన విజయంతో ఐపీఎల్‌ రెండో దశను ఆరంభించింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. విరాట్‌ సేనను 92కే ఆలౌట్‌ చేసి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఊహించని పరాజయం చవిచూసింది ముంబయి ఇండియన్స్‌. తర్వాతి మ్యాచులో ఎలాగైన విజయం సాధించాలన్న కసితో ఉంది. అందుకే ముంబయి, కోల్‌కతా పోరుతో సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.


అమ్మో.. ముంబయి
ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబయి అత్యంత బలమైన జట్టు. రెండు సార్లు విజేతైన కోల్‌కతా పైనా వారిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 28 సార్లు తలబడితే రోహిత్‌ సేన ఏకంగా 22 సార్లు విజయ దుందుభి మోగించింది. కోల్‌కతా కేవలం 6 సార్లే గెలిచింది. చివరిసారి తలపడ్డ ఐదులో ఆఖరి నాలుగు మ్యాచుల్లో ముంబయి దుమ్మురేపింది. ఈ సీజన్‌ తొలి మ్యాచులో ముంబయి చేసిన 152 పరుగులను కోల్‌కతా ఛేదించలేక 10 పరుగుల తేడాతో ఓడింది. రాహుల్‌ చాహర్‌ తన స్పిన్‌తో 4 వికెట్లు తీసి 27 పరుగులే ఇచ్చాడు. ముంబయి బౌలింగ్‌ విభాగం ప్రత్యర్థిని వణికించింది.


Also Read: సన్‌రైజర్స్ బృందంలో ఈ ఆటగాడికి కరోనా పాజిటివ్.. 


గెలిస్తే ఎవరికేంటి?
ప్రస్తుత మ్యాచ్‌ రెండు జట్లకు అత్యంత కీలకం. ఈ పోరులో గెలిస్తే ముంబయి 10 పాయింట్లతో పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. ప్లేఆఫ్స్‌ ముందు వారిపై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. ఓడితే మాత్రం ఆ తర్వాత కనీసం 3 మ్యాచులు తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక 8 పాయింట్లతో ఉన్న కోల్‌కతా గెలిస్తే 10 పాయింట్లతో ముంబయిని వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి వెళ్తుంది. మెరుగైన రన్‌రేట్‌ ఉండటమే ఇందుకు కారణం.


Also Read: Afghanistan T20 WC Ban: అఫ్గాన్‌ క్రికెట్‌పై పిడుగు! ఐసీసీ జట్టును బహిష్కరించే ప్రమాదం!


రోహిత్‌ వస్తే..
ముంబయిలో ఆటగాళ్లకు తిరుగులేదు. ఒకరు పోతే మరొకరు గెలుపు బ్యాటన్‌ అందుకుంటారు. చెన్నై మ్యాచులో నిరాశపడినా కోల్‌కతాపై అలా జరిగే ఆస్కారం తక్కువ! రోహిత్‌శర్మ వస్తే ఆ జట్టుకు కొండంత బలం వస్తుంది. కానీ అతడి పిక్క కండరాల గాయం గురించి పూర్తి సమాచారం లేదు. కోల్‌కతాపై అతడికి మెరుగైన రికార్డు ఉంది. ఇక హార్దిక్‌ పాండ్య తిరిగొస్తే జట్టు సమతూకం పెరుగుతుంది. ఈ సారి సూర్యకుమార్‌ భారీ స్కోర్‌ చేసే అవకాశం ఉంది. పొలార్డ్‌ సైతం కసితో ఉన్నాడు. చివరి మ్యాచులో బౌలింగ్‌లో బౌల్ట్‌, బుమ్రా ఆరంభంలో పరుగులు నియంత్రించినా ఆఖర్లో గతి తప్పారు. ఈ సారి సరిచేసుకొనే అవకాశం ఉంది. ఇక రాహుల్‌ చాహర్‌ కోల్‌కతాను వణికిస్తాడనడంలో సందేహం లేదు. కానీ ముంబయి బ్యాటింగ్‌ విభాగం వరుణ్‌ చక్రవర్తిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.


Also Read: PAK vs ENG: కోహ్లీసేనే కాదు.. కివీస్‌, ఇంగ్లాండ్‌ కూడా మా శత్రువులే: రమీజ్‌ రాజా


మానసికంగా గెలిస్తే..
కోల్‌కతా చివరి మ్యాచులో విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉంది. ఓపెనింగ్‌లో శుభ్‌మన్‌కు వెంకటేష్‌ అయ్యర్‌ తోడయ్యాడు. ఆర్‌సీబీ పోరులో అద్భుతమైన షాట్లు ఆడాడు. నితీశ్‌ రాణా, రసెల్‌, మోర్గాన్‌, డీకే రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. గూగ్లీలు విసురుతూ వికెట్లు తీస్తున్నాడు. అతడికి మరో స్పిన్నర్‌ సునిల్‌ నరైన్‌ తోడుగా ఉన్నాడు. కొన్నేళ్లుగా మోకాలి గాయం వేధిస్తున్నా రసెల్‌ బౌలింగ్‌లోనూ రాణిస్తుండటం కోల్‌కతాకు అనుకూలం. కివీస్‌ మీసాల కుర్రాడు ఫెర్గూసన్‌ సైతం మంచి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా ముంబయితో అనగానే కోల్‌కతా మానసికంగా వెనకబడుతోంది. ఆ ఫీలింగ్‌ను పోగొట్టుకుంటే విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.