ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కొవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోడీ బుధవారం ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో అమెరికాకు వెళ్లారు. జాతీయ భద్రత సలహాదారుడు అజిత్‌ దోవల్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా సహా పలువురు ఉన్నతాధికారులు ప్రధానితో ఉన్నారు.


25 వరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటనలో భాగంగా క్వాడ్ సదస్సు, 76వ ఐరాస జనరల్ అసెంబ్లీలో పాల్గొననున్నారు. ఇవాళ గ్లోబల్ సీఈవోలతో వాషింగ్టన్ డీసీలో సమావేశం అవుతారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రత్యేకంగా భేటీ అయి ధ్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.


 






కరోనా వ్యాప్తి అనంతరం ప్రధాని మోడీ చేస్తున్న తొలి అమెరికా పర్యటన ఇది. క్వాల్కమ్, అడోబ్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్స్, ఫస్ట్ సోలార్ కంపెనీల సీఈవోలు, ముఖ్య ప్రతినిధులతో ప్రధాని మోడీ గురువారం నాడు సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసే విందులో మోదీ పాల్గొంటారు. అమెరికా పయనం అవడానికి ముందు జో బైడెన్ ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో పర్యటనకు వెళుతున్నానని మోదీ ట్వీట్ చేశారు. 


సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరిలో అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఈ ఇద్దరు ముఖాముఖీ భేటీ అవుతున్నారు. దీంతో ప్రధాని మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.  అప్ఘానిస్తాన్‌ పరిణామాలు, ఉగ్రవాదం, చైనా ఆధిపత్యం, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు.


 






ప్రధాని మోడీ బయల్దేరిన విమానం అఫ్గానిస్థాన్ గగన తలం మీదుగా కాకుండా పాకిస్తాన్ మీదుగా ప్రయాణించింది. తాలిబన్ల దురాక్రమణతో అఫ్గానిస్థాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ మీదుగా వెళ్లారు. అందుకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్ నిరాకరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ తీరుపై భారత్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌లో తన నిరసన గళాన్ని వినిపించింది.


 


Also Read:PM Modi at Global COVID-19 summit: వ్యాక్సిన్ సర్టిఫికెట్లకు పరస్పర గుర్తింపు అవసరం.. గ్లోబల్ కోవిడ్ 19 సమ్మిట్‌లో ప్రధాని మోదీ


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.