అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లకు పరస్పర గుర్తింపు అవసరమని తెలిపారు. గ్లోబల్ కోవిడ్ 19 సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలకు పరస్పర గుర్తింపు అందించాలని ప్రపంచ దేశాలను ఉద్దేశించి అన్నారు. కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధాని అన్నారు. ప్రపంచంలో ఇంకా చాలా మందికి టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తుందని తెలిపారు. వైద్య పరికరాలు, పీపీఈ కిట్ల ఉత్పత్తి పెంచి, ఇతర దేశాలకు సైతం తక్కువ రేటుకే అందిస్తుందని పేర్కొన్నారు. ఇండియాలో అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోందని.. ఇప్పటికే 80 కోట్ల మందికి టీకాలను అందించామని చెప్పారు.


భారతీయులపై బ్రిటన్ ప్రభుత్వం విధించిన క్వారంటైన్ నిబంధనలపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కోవిషీల్డ్ టీకాకు గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించిన యూకే.. మరో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తమ దేశానికి వచ్చే ప్రయాణికులు.. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తమకు కోవిషీల్డ్ టీకాతో ఎలాంటి సమస్య లేదని.. దానికి అందించే కోవిన్ (CoWIN) సర్టిఫికెట్‌తోనే ఇబ్బంది అని గందరగోళ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 






Also Read: PM Modi Update: ప్రధాని మోదీ అమెరికా టూర్.. గ్లోబల్ సీఈవోలతో సెప్టెంబర్ 23న కీలక భేటీ


Also Read: UK's Travel Advisory: కోవిషీల్డ్‌‌పై గందరగోళం.. కోవిన్ ధ్రువపత్రంతో సమస్య ఉందంటున్న యూకే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి