ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అమెరికా పర్యటనకు పయనమయ్యారు. నేటి నుంచి 25 వరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటనలో భాగంగా క్వాడ్ సదస్సు, 76వ ఐరాస జనరల్ అసెంబ్లీలో పాల్గొననున్నారు. అమెరికా చేరుకున్న తరువాత సెప్టెంబర్ 23న గ్లోబల్ సీఈవోలతో వాషింగ్టన్ డీసీలో సమావేశం అవుతారు.
కరోనా వ్యాప్తి అనంతరం ప్రధాని మోదీ చేస్తున్న తొలి అమెరికా పర్యటన ఇది. క్వాల్కమ్, అడోబ్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్స్, ఫస్ట్ సోలార్ కంపెనీల సీఈవోలు, ముఖ్య ప్రతినిధులతో ప్రధాని మోదీ గురువారం నాడు సమావేశం కానున్నారు. అదేరోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసే విందులో మోదీ పాల్గొంటారు. అమెరికా పయనం అవడానికి ముందు జో బైడెన్ ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో పర్యటనకు వెళుతున్నానని మోదీ ట్వీట్ చేశారు.
Also Read: అమెరికా టూర్‌కు మోదీ పయనం.. బైడెన్‌తో భేటీపైనే అందరి దృష్టి
సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరిలో అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఈ ఇద్దరు ముఖాముఖీ భేటీ అవుతున్నారు. దీంతో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్, తదితర ఉన్నతాధికారులు అమెరికాలో కీలక భేటీలలో భాగస్వాములు కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రత్యేకంగా భేటీ అయి ధ్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Also Read: భారత ఆరోగ్యమంత్రికి డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు.. కారణమిదే