అఫ్గానిస్థాన్ క్రికెట్ చిక్కుల్లో పడింది. ఐసీసీ నిషేధం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది! ఒకవేళ ఆ జట్టు తాలిబన్ల జెండా కింద ఆడితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచే బహిష్కరించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఐసీసీ సభ్యత్వం నుంచి తొలగిస్తారని సమాచారం. ఈ మేరకు టెలిగ్రాఫ్ క్రికెట్ ఓ కథనం ప్రచురించింది.
పదేళ్లుగా అఫ్గానిస్థాక్ క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. అంచెలంచెలుగా ఎదిగింది. భారత్ సహాయంతో అక్కడి క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నారు. కొన్నేళ్ల వరకు భారత్‌లోని ఇండోర్‌ను తమ సొంత మైదానంగా ఎంచుకొంది. విదేశీ జట్లతో ఇక్కడే ఆడేది. జట్టు ప్రమాణాలు పెరగడంతో టెస్టు క్రికెట్లోనూ ప్రవేశించింది. స్కాట్లాండ్‌తో పాటు దానికీ శాశ్వత సభ్యత్వం దొరికింది.
Also Read: PAK vs ENG: కోహ్లీసేనే కాదు.. కివీస్, ఇంగ్లాండ్ కూడా మా శత్రువులే: రమీజ్ రాజా
సుదీర్ఘ ఫార్మాట్లో అఫ్గాన్‌కు పెద్దగా అనుభవం లేకున్నా టీ20 క్రికెట్లో మాత్రం పెద్ద జట్లకూ షాకులిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్‌ను సైతం ఇబ్బంది పెట్టగల బౌలర్లు ఆ జట్టుకు ఉన్నారు. పెద్ద జట్లైన బంగ్లాదేశ్, శ్రీలంక ఐసీసీ 20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేక ఇబ్బంది పడితే అఫ్గాన్ మాత్రం నేరుగా అర్హత సాధించి అబ్బుర పరిచింది.
అమెరికా సేనలు హఠాత్తుగా అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంతో ఆ దేశం రావణకాష్ఠంలా మారింది. పౌర ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు వేగంగా దేశాన్ని ఆక్రమించారు. నియంతృత్వ పాలన చేపట్టారు. వచ్చీ రాగానే మహిళలపై ఆంక్షలు పెట్టారు. మహిళలు క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించారు. అయితే పురుషుల జట్టుపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచకప్‌నకు కొన్ని రోజుల ముందు ప్రతి జట్టు ఏ దేశం జెండా కింద ఆడుతున్నామో చెప్పాలి. దాంతో అఫ్గాన్ ఏ జెండా కింద ఆడుతుందో తెలియడం లేదు. ఒకవేళ వారు తాలిబన్ల జెండాను ఇస్తే.. ఐసీసీపై ఒత్తిడి పెరుగుతుంది.
సాధారణంగా క్రికెట్లోకి పార్టీలు, రాజకీయాలను ఐసీసీ అనుమతివ్వదు. బోర్డులన్నీ స్వతంత్రంగా ఉండాలి. కానీ అఫ్గాన్ గనక తాలిబన్ల జెండా కింద ఆడితే రాజకీయాలపై ఐసీసీ తన నిర్ణయం మార్చుకున్నట్టే అవుతుంది. దాంతో అఫ్గాన్‌ను ప్రపంచకప్ నుంచి బహిష్కించేందుకు బోర్డు మొగ్గు చూపనుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సభ్యత్వమూ రద్దు చేసేందుకు వెనుకాడదని అంటున్నారు. చివరికి ఏమవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.