నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా, మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెకు ఇక టీమ్‌ఇండియాలో చోటు కష్టమే! వీరిద్దరితో మళ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అక్కడ ఫామ్‌ నిరూపించుకున్నాక మళ్లీ ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌కు సెలక్షన్‌ కమిటీ సంకేతాలు పంపించిందని సమాచారం. 


అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా.. వీరిద్దరినీ రాహుల్‌ ద్రవిడ్‌ వారసులుగా భావించారు! అతడిలా జట్టును కాపాడతారని విశ్వాసించారు. అందుకు తగ్గట్టే వీరెన్నో మ్యాచుల్లో టీమ్‌ఇండియాను రక్షించారు. అనేక మ్యాచుల్లో గెలిపించారు. అలాంటి రెండేళ్లుగా నిలకడగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కీలకమైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో సులభంగా వికెట్‌ ఇచ్చేస్తున్నారు. భారత్‌లోనూ ఆశించిన మేర రాణించడం లేదు.


చివరి 12 నెలల్లో 14 మ్యాచులాడిన పుజారా సగటు 24.08గా ఉంది. 2019 నుంచి అతడు సెంచరీలే చేయలేదు. ఇక అజింక్య రహానె సగటు మరీ ఘోరం! 13 మ్యాచుల్లో 20 సగటు నమోదు చేశాడు. మూడు అర్ధశతకాలు చేయగా, 10సార్లు ఒకే అంకె స్కోరుకు పెవిలియన్‌ చేరుకున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీసులో 136 పరుగులు చేశాడు. అందుకే వీరిద్దరికీ తలుపులు మూసేయకుండా ఫామ్‌ అందుకొనేలా దేశవాళీ క్రికెట్‌ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.


'వారిద్దరు టీమ్‌ఇండియాకు గొప్ప సేవకులు. వారు మరో అవకాశానికి అర్హులు. కానీ అదిప్పుడు కాదు! ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి శుభ్‌మన్‌ గిల్‌ను మిడిలార్డర్‌లో ఎలా ఉపయోగించుకోవాలా అని మేం చర్చించుకుంటున్నాం. న్యూజిలాండ్‌ సిరీసులో రాహుల్‌ ద్రవిడ్‌ అతడితో మాట్లాడాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి దొరికిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. వారిద్దరూ ప్రతిభావంతులే. పరిస్థితులను బట్టి వాడుకుంటాం'  అని సెలక్షన్‌ వర్గాలు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌కు చెప్పినట్టు తెలిసింది.


టీమ్‌ఇండియా తర్వాతి కెప్టెన్‌ గురించి ఇంకా చర్చించలేదని సమాచారం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీసుకు ఇంకా సమయం ఉంది. ఇప్పటికైతే రోహిత్‌ శర్మనే అన్ని ఫార్మాట్లలో నాయకుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఒకవేళ అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు ఉండనని నిరాకరిస్తే మరొకరి గురించి ఆలోచిస్తారని సమాచారం. గాయాలు సహజమేనని, అతడిప్పుడు వంద శాతం దృఢంగా ఉన్నాడని అంటున్నారు.


Also Read: Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!


Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్‌!


Also Read: Lucknow IPL Franchise: కేఎల్‌ రాహుల్‌ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!