India tour of Ireland: టీమ్‌ఇండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ (Sanju Samson) వినూత్న పంథా అనుసరిస్తున్నాడు. భారత జట్టులో పర్మనెంట్ ప్లేస్ కోసం సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) బాటలోనే నడుస్తున్నాడు. ఐర్లాండ్‌తో సిరీసుకు ముందు అతడు దుబాయ్‌లో విపరీతంగా కష్టపడ్డాడు!!
దేశంలోని అద్భుతమైన యువ క్రికెటర్లలో సంజు శాంసన్ ఒకడు. ఫామ్‌లో ఉంటే ఎలాంటి బౌలర్‌నైనా, ఎలాంటి బంతినైనా చితక్కొట్టేస్తాడు. క్రీజులో నిలబడి మరీ సిక్సర్లు దంచుతాడు. ఐపీఎల్‌లో అతడి బ్యాటింగ్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది సీనియర్ క్రికెటర్లు అతడి ఆటకు ఫిదా అవుతారు. అలాంటిది అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతడు నిలదొక్కుకోలేదు. 2015లోనే అరంగేట్రం చేసినా ఇప్పటి వరకు ఆడింది కేవలం 13 టీ20లు. అతడి అమ్ముల పొదిలో ఎన్నో షాట్లున్నా ఒకే షాటు మళ్లీ మళ్లీ ఆడి త్వరగా ఔటవుతుంటాడు.
ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2022)లో సంజు శాంసన్ సరికొత్తగా కనిపించాడు. అంత సులభంగా వికెట్టేమీ ఇవ్వలేదు. బౌలర్లను గౌరవిస్తూనే విధ్వంసం కొనసాగించాడు. 400 పైచిలుకు పరుగులు చేశాడు. అయినా దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీసులో సెలక్టర్లు అతడికి చోటివ్వలేదు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఆ మెగా టోర్నీకి ఎంపికవ్వాలని సంజు పట్టుదలగా ఉన్నాడు. అందుకే సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ బాటను అనుసరించాడు.
Also Read: కస్టమర్స్ అలర్ట్! జులైలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవు!
Also Read: మీకే కాదు నాకూ బాధేస్తోందన్న కపిల్‌దేవ్!
ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యే ముందే దుబాయ్‌లో వాలిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ యూత్ అకాడమీ అధినేత సిధ్ లాహిరీ మరికొందరు నిపుణుల నేతృత్వంలో అక్కడ శిక్షణ పొందాడు. తన ఆటను మరింత మెరుగుపర్చుకోవాలని సంజు భావిస్తున్నాడు. సాధారణంగా క్రీజులో నిలబడి దంచే అతడు ఈసారి బ్యాక్ ఫుట్ షాట్లను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐర్లాండ్‌లోని వికెట్ల వేగానికి అనుగుణంగా సాధన చేశాడు. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ నుంచి అతడికి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి దుబాయ్ ప్రాక్టీస్‌తో అతడు ఐర్లాండ్‌లో బాగా ఆడి ప్రపంచకప్‌లో చోటు సాధిస్తాడేమో చూడాలి.