దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఐదో రోజు లంచ్ ముగిసిన కొద్దిసేపటికే 191 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా, షమి మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్, అశ్విన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు కేవలం ఇది నాలుగో టెస్టు విజయం మాత్రమే.
182-7తో లంచ్ నుంచి బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ రెండు ఓవర్లలోనే ముగిసిపోయింది. షమీ వేసిన మొదటి ఓవర్ తొలి రెండు బంతులకు బౌండరీలు కొట్టిన మార్కో జెన్సన్ (13: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) ఐదో బంతికి అవుటయ్యాడు. ఇక తర్వాతి ఓవర్ వేసిన అశ్విన్ చివరి రెండు బంతులకు రబడ, ఎంగిడిలను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా పోరాటం ముగిసింది. టెంపా బవుమా (35: 80 బంతుల్లో, నాలుగు ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు.
అంతకుముందు మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న డీన్ ఎల్గర్‌ను (77: 156 బంతుల్లో, 12 ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి బుమ్రా భారత్‌కు ఐదో రోజు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్ (21: 28 బంతుల్లో, రెండు ఫోర్లు), వియాన్ ముల్డర్ (1: 3 బంతుల్లో) వరుస బంతుల్లో అవుటయ్యారు.
టెస్టు మ్యాచ్ మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (123: 260 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడికి ఆరు వికెట్లు దక్కాయి. అనంతరం భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్ భావోద్వేగం
Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి