టీమ్‌ఇండియా ఒకప్పటి స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత అతడు కేరళ తరఫున రంజీ మ్యాచులు ఆడనున్నాడు. వచ్చే సీజన్‌కు ప్రాబబుల్స్‌లో కేరళ క్రికెట్ సంఘం అతడి పేరును చేర్చింది. పద్దెనమిదేళ్ల కుర్రాడు తొలిసారి ఎరుపు బంతి క్రికెట్ ఫార్మాట్‌కు ఎంపికైనప్పుడు ఉండే భావోద్వేగమే తనకూ కలుగుతోందని శ్రీ పేర్కొన్నాడు.
'జెర్సీ మూవీలోని ఈ ఫీలింగే నాకూ ఉంది. ఆ అనుభూతిని వర్ణించలేను. జీవిత కాలంగా ఈ అవకాశం ఎదురు చూస్తున్నట్టు ఫీలవుతున్నా. అందరికీ ధన్యవాదాలు. నేను అత్యుత్తమంగా ఆడాలని ప్రార్థన చేయండి' అని శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. జెర్సీ మూవీలో రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్నప్పుడు నాని అరిచే భావోద్వేగ సన్నివేశాన్ని పోస్టు చేశాడు.
'తొమ్మిదేళ్ల తర్వాత నేను ప్రేమించే రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడబోతున్నా. ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు. తెల్లరంగు జెర్సీలో ఎరుపు బంతితో ఆడబోతున్నందుకు సంతోషంగా ఉంది. నా జర్నీ ఇక్కడ నుంచే మొదలైంది. నాకెంతో ఆత్రుతగా ఉంది' అని మరో వీడియోను పోస్టు చేశాడు.
జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకొని కెరీర్లో అద్భుతంగా ఎదుగుతున్న రోజుల్లో శ్రీశాంత్ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నాడు. బీసీసీఐ చేత జీవితకాల నిషేధానికి గురయ్యాడు. సుదీర్ఘ కాలం స్థానిక కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు పోరాడాడు. చివరికి నిషేధం నుంచి బయట పడి క్రికెట్ బంతి పట్టుకున్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నా అతడికి బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు రంజీల్లో ఎలా ఆడతాడో చూడాలి.