దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు టీమ్‌ఇండియా ఎంపిక చేసిన జట్టుపై అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. పరుగులు చేయకపోయినా పదేపదే ఆ ఇద్దరికీ చోటిస్తున్నారని ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. తెలుగు ఆటగాడు హనుమ విహారిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాఫ్రికా-ఏ సిరీసులో అతడు అద్భుతంగా ఆడిన సంగతిని గుర్తు చేస్తున్నారు.






ఆస్ట్రేలియా పర్యటనలో హనుమ విహారి గాయపడ్డాడు. మోకాలి గాయం వేధిస్తున్నా ఒక రోజంగా క్రీజులో నిలబడి సిరీసును కాపాడాడు. గాయం నుంచి కోలుకొనేందుకు విహారికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లిన అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. అయినప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకైనా ఎంపిక చేస్తారేమో అనుకుంటే అదీ లేదు.






ఎందుకు తీసుకోలేదని విమర్శలు రావడంతో భారత్‌-ఏతో విహారిని దక్షిణాఫ్రికా పంపించారు. ఆ సిరీసులో అతడు అద్భుతంగా ఆడాడు. వరుసగా 25 (53), 54 (164), 72* (116), 63 (170), 13* (15) చేశాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్సుల్లో 75.66 సగటుతో 227 పరుగులు చేశాడు. కోహ్లీసేన సఫారీ పర్యటనకు బయల్దేరే ముందు విహారి పేరును జట్టులో చేర్చారు. సీనియర్‌ ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, యువ క్రికెటర్లు శార్దూల్‌ ఠాకూర్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో విహారికి పోటీ ఎదురవుతోంది.










సీనియర్లు, అనుభవం దృష్ట్యా సెంచూరియన్‌ టెస్టులో పుజారా, రహానెకు చోటు లభించింది. ఆల్‌రౌండర్‌ కోటాలో శార్దూల్‌ను తీసుకున్నారు. దక్షిణాఫ్రికా-ఏ సిరీసులో బాగా ఆడిన విహారికి చోటు దక్కలేదు. దాంతో అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. అతడేం తప్పు చేశాడని ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. బహుశా రెండు లేదా మూడో టెస్టులో తెలుగు ఆటగాడికి చోటు దక్కొచ్చు.