IND vs SA 1st T20 Player Match ups: ఐపీఎల్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ టీ20కి టీమ్‌ఇండియా రెడీ! మరికొన్ని గంటల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఇందుకు వేదిక. సీనియర్లకు విశ్రాంతినివ్వడం, కుర్రాళ్లను ఎంపిక చేయడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడంతో రిషభ్ పంత్ పగ్గాలు అందుకున్నాడు. ఈ మ్యాచులో కొందరు ఆటగాళ్ల మధ్య వైరం ఆకట్టుకోనుంది. భువీ x డికాక్, యూజీ x బవుమా, హర్షల్ x మిల్లర్ పోరు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు!
డికాక్‌పై భువీ స్వింగ్
ఐపీఎల్ 2022లో క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించాడు. 36.29 సగటు, 149.97 స్ట్రైక్‌రేట్‌తో 508 పరుగులు చేశాడు. పవర్‌ప్లేలో అతడు చెలరేగే అవకాశం ఉంది. అతడిని అడ్డుకొనేందుకు టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ప్రయోగించనుంది. ఎందుకంటే అతడు పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ డికాక్‌ను ఇబ్బంది పెడతాడు. బంతి బ్యాటు అంచుకు తగిలి ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో డికాక్‌ను భువీ రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం.
Also Read: షోయబ్ అక్తర్ రికార్డుకు మూడినట్టే! 163.KPH వేగంతో బంతి విసిరిన ఉమ్రాన్ మాలిక్!
బవుమాపై యూజీ అస్త్రం
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చాహల్. 27 వికెట్లు తీసి రాజస్థాన్ రన్నరప్‌గా నిలవడంలో కీలకంగా మారాడు. ఘనంగా పునరాగమనాన్ని చాటాడు. మ్యాచులో ఏ దశలో బంతి ఇచ్చినా పరుగులు నియంత్రించడం, వికెట్లు తీయడం యూజీ అలవాటు. సఫారీ సారథి తెంబా బవుమాకు టీమ్‌ఇండియా స్పిన్నర్లపై మంచి అనుభవమే ఉంది. అయితే అతడిని యూజీ అడ్డుకోగలడు. ఫ్లయిడెట్ డెలివరీలతో ఊరించి ఔట్ చేయగలడు.
మిల్లర్‌కు హర్షలే కిల్లర్
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో విజేతగా నిలిచిందంటే డేవిడ్ మిల్లర్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. హార్దిక్ పాండ్య, టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ అతడు క్రీజులో నిలిచాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాపై మిల్లర్ ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ ఉంది. ఇక్కడి పిచ్‌లపై అతడికి అనుభవం ఉంది. స్పిన్నర్లనూ ఆడటం నేర్చుకున్నాడు. అందుకే అతడిని అడ్డుకొనేందుకు హర్షల్ పటేల్ సరైన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. వేగంలో చకచకా మార్పులు చేస్తూ వైవిధ్యంతో అతడిని బోల్తా కొట్టించగలడు. స్లోవర్ బాల్స్, కట్టర్స్‌తో నిలువరించగలడు.