Umran Malik Bowled 163.7 KPH Speed During Practice Session Ahead of IND vs SA T20 Series - Reports : జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తున్నాడు. బుధవారం జరిగిన టీమ్‌ఇండియా ప్రాక్టీస్ సెషన్లో అతడు గంటకు 163.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడని సమాచారం. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ అంత వేగంతో బంతి వేశాడని తెలియడంతో అభిమానులు ఉద్వేగానికి గురవుతున్నారు. అతి త్వరలోనే అతడు షోయబ్ అక్తర్, బ్రెట్‌లీ స్పీడ్ రికార్డులను బ్రేక్ చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2021లో ఉమ్రాన్ మాలిక్ అత్యున్నత స్థాయి క్రికెట్‌కు పరిచయం అయ్యాడు. దుబాయ్‌లో రెండో దశ జరుగుతున్నప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో గాయం కారణంగా ఓ పేసర్ దూరమయ్యాడు. అదే సమయంలో నెట్ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడే తన వేగంతో ఆకట్టుకున్నాడు. దాంతో 2022 సీజన్‌కు అతడిని రీటెయిన్ చేసుకుంది. అన్ని మ్యాచుల్లో అవకాశం ఇచ్చింది. ఇదే అదునుగా అతడు వేగంలో ఐపీఎల్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్లాడు. 157 కిలోమీటర్ల వేగంతో బంతులేశాడు. 14 మ్యాచుల్లో 9.03 ఎకానమీ, 20.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో నిలిచాడు.
Also Read: ఈ ముగ్గురిని ఆ ముగ్గురే అడ్డు! మిల్లర్‌కు టీమ్‌ఇండియా కిల్లర్ ఎవరంటే?
అత్యంత వేగంగా బంతులేస్తుండటంతో ఉమ్రాన్ మాలిక్‌పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడిని ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు. కేవలం వేగమే కాకుండా నిలకడగా సరైన లెంగ్తుల్లో బంతులేసేలా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికి ఎక్కువగానే అవకాశాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం.
ఏదేమైనా ఉమ్రాన్ మాలిక్ 163 కి.మీ వేగంతో బంతులేస్తున్నాడని తెలియడంతో అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.