అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు చాలా విచిత్రమైన తీర్పునిచ్చింది. ఇకపై కాలఫోర్నియాలో తేనెటీగలు, చేపలతో సమానమని చెప్పింది. చదివిన వెంటనే మీకు ఇది తలతిక్క తీర్పుగా అనిపించవచ్చు. కానీ అసలు విషయం తెలుసుకుంటే కోర్టు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే ఆ తీర్పునిచ్చిందని అర్థమవుతంది. తేనెటీగల జాతులను కాపాడుకోవడం కోసమే కాలిఫోర్నియాలో వాటిని లీగల్ గా చేపలతో సమానమని తేల్చి చెప్పింది. ఎందుకలా తీర్పు చెప్పాల్సి  వచ్చిందంటే...


అసలు కథ...
పూవు పూవును చేరి తేనెను సేకరించే తేనెటీగల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఓ నాలుగు రకాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. బంబుల్ తేనేటీగలు కూడా వాటిలో ఓ రకమే. 2019లో కాలిఫోర్నియాలో ఫిష్ అండ్ గేమ్ కమిషన్ నాలుగు రకాల తేనెటీగలను అంతరించిపోతున్నట్టుగా గుర్తించింది. వాటి కోసం కొన్ని ప్రాంతాలను కాపాడుకోవాలని, అక్కడ వాటి జీవితాలకు భంగం కలిగించేలా ఏం చేయకూడదని అక్కడి రైతు సంఘాలను ఆదేశించింది. దీంతో ఆ సంఘం ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. కాలిఫోర్నియా వన్యప్రాణి అధికారులపై ఫిర్యాదు చేశారు. అప్పట్నించి కేసు కోర్టులో నలుగుతూ వచ్చింది. అధికారులు తేనెటీగలకు చట్టపరమైన రక్ష కల్పించాలని కోర్టును కోరింది. అంతరించిపోతున్న జాతుల చట్టాన్ని వీటికి వర్తించాలని కోరింది. 


ఏడు రైతు సంఘాలు ఆ చట్టం కేవలం పక్షులు, చేపలు, క్షీరదాలు, ఉభయ చరాలు, మొక్కలు, సరీసృపాలకు మాత్రమే వర్తిస్తుందని, తేనెటీగలకు వర్తించదని వాదించాయి. తేనెటీగల అవసరాన్ని గుర్తించిన కోర్టు ఎవ్వరూ ఊహించని తీర్పునిచ్చింది. తేనెటీల్లో అందరించిపోతున్న నాలుగు జాతులను చట్టం కిందకు తేవచ్చని చెప్పింది. ‘సముద్రంలో ఉన్న చేపలకే రక్షణ కల్పిస్తున్నాం, మన కళ్ల ముందు తిరుగాడుతూ, మన కోసం కష్టపడే తేనెటీగలను కాపాడుకోలేమా? ఇకపై తేనెటీగలు కూడా చేపలతో సమానం. వాటికి వర్తించే చట్టం వీటికీ వర్తిస్తుంది’ అని తీర్పునిచ్చింది. దీంతో ఈ తేనెటీగల ఆవాసాలు ఉన్నచోట ఎవ్వరూ వాటి స్వేచ్చకు, మనుగడకు భంగం కలిగించకూడదు. ఇది పర్యావరణవేత్తల విజయంగా కాలిఫోర్నియాల భావిస్తున్నారు. 


కోర్టుకు తెలుసు...
మన పర్యవరణ వ్యవస్థ తేనెటీగలపై ఎంతగా ఆధారపడి ఉందో కోర్టుకు తెలుసు. పరాగసంపర్కంపైనే పర్యావరణం ఆధారపడి ఉంది. కానీ కాలిఫోర్నియాలో వాటి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. తేనెటీగలే అంతరించిపోతే మనిషి మనుగడ క్షీణించడం మొదలవుతుంది.రైతులు వాడే పురుగు మందులు, రసాయనాలు తేనెటీగలు చనిపోవడానికి కారణమని కోర్టు నమ్మింది, కాబట్టే పర్యావరణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 


తేనెటీగలే లేకపోతే...
తేనెటీగలే లేకపోతే మనిషి కేవలం నాలుగేళ్ల కన్నా ఎక్కువ కాలం బతకడలేడని అప్పట్లో ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు కూడా. తేనెటీగల వల్లే ఆహార ఉత్పత్తి భారీగా జరుగుతుంది. కాయలు కాయడానికి, పంటలు పండేందుకు ఇదే మనిషికి సాయపడుతుంది. 


Also read: వందేళ్ల తరువాత మళ్లీ కనిపించిన ‘లిప్‌స్టిక్’ మొక్కలు, ఎక్కడో తెలుసా?


Also read: మీరు చేసే ఈ పనులు కిడ్నీలను దెబ్బతీస్తాయి, కిడ్నీ మార్పిడి వరకు తెచ్చుకోవద్దు