ప్రపంచంలో ఎన్నో అరుదైన మొక్కలు. కాలక్రమేణా వాతావరణంలో మార్పుల వల్ల అవి అంతరించిపోవడం మొదలైంది. అలా మన దేశంలో అంతరించిపోయిందనుకున్న ఓ అరుదైన మొక్కను పరిశోధకులు మళ్లీ కనుగొన్నారు. ఆ మొక్క పేరు ‘ఇండియన్ లిప్‌స్టిక్ ప్లాంట్’. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు దాదాపు వందేళ్ల తరువాత ఈ మొక్కను అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతమైన అంజావ్ జిల్లాలో కనిపెట్టారు. దీన్ని మొదటిసారి 1912లో బ్రిటీష్ వృక్షశాస్త్రజ్ఞుడు స్టీఫెన్ ట్రోయ్ట్ డన్ గుర్తించారు. ఆయన మరో ఆంగ్ల శాస్త్రవేత్త ఐజాక్ హెన్రీ బుర్కిల్ అరుణాచల్ ప్రదేశ్ నుండి సేకరించిన మొక్కల నమూనాలలో ఈ అరుదైన మొక్కలను గుర్తించారు. ఆ తరువాత మళ్లీ ఈ మొక్క జాడ లేదు. దీంతో అంతరించిపోయిందనుకున్నారు మన భారత శాస్త్రవేత్తలు.
ఎందుకా పేరు?
లిప్ స్టిక్ మొక్క శాస్త్రీయ నామం ఎస్కినాంథస్ మోనిటేరియా డన్. దీని ఆకారం, రంగును బట్టి ‘లిప్‌స్టిక్ మొక్క’ అని పేరు పెట్టారు. చూడటానికి గొట్టంలా ఉండి ఎర్రగా లిప్ స్టిక్ ఆకారంలో కనిపిస్తుంది. అందుకే వాటికి ఆ పేరు వచ్చినట్టు శాస్త్రవేత్త కృష్ణ చౌలు తెలిపారు. ఈయన అరుణాచల్ ప్రదేశ్లోని పూలపై అధ్యయనం చేస్తున్నప్పుడు గతేడాది అంజావ్ జిల్లాలోని హ్యులియాంగ్, చిప్రూ ప్రాంతాల్లో లిప్ స్టిక్ మొక్కల నమూనాలను సేకరించారు. ఆ నమూనాలను పరీక్షించాక అది అరుదైన లిప్ స్టిక్ మొక్కగా నిర్ధారించారు. 1912 తరువాత ఈ మొక్కల నమూనాలు ఎక్కడా దొరకలేదు. అందుకే వందేళ్ల తరువాత మళ్లీ ఈ మొక్క కనిపించినట్టు గుర్తించారు.
పేరుకు అర్థం...
ఈ మొక్కల పేరు ఎస్కినాంథస్ అని చెప్పుకున్నాం కదా. ఈ పదం గ్రీకు నుంచి వచ్చినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గ్రీకుపదమైన ఐస్కీన్ నుంచి ఇది ఉద్భవించిందని వివరిస్తున్నారు. ఐస్కీన్ అంటే అవమానం లేదా ఇబ్బందిగా భావించడం అని అర్థమట. ఇక ఆంథోస్ అంటే పువ్వు అని అర్థం.
అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నో అందమైన పూల జాతులు, మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా అంజావ్ జిల్లాలో మరీను. కాకపోతే ఈ జిల్లాలో తరచుగా కొండచరియలు విరిగిపడడం, రోడ్ల విస్తరణ పనులు జరగడం, మార్కెట్లు కోసం భూమిని తవ్వేయడం, సాగు కోసం మొక్కలు తీసేయడం వంటివి జరుగుతున్నాయి. దీనవల్లే లిప్ స్టిక్ మొక్కల్లాంటి అరుదైన జాతులు అంతరించిపోతున్నట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
Also read: మీరు చేసే ఈ పనులు కిడ్నీలను దెబ్బతీస్తాయి, కిడ్నీ మార్పిడి వరకు తెచ్చుకోవద్దు