శరీరంలో ప్రధాన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి నిరంతరం పనిచేస్తేనే మన ఆరోగ్యం బాగుండేది. శరీరంలోని విషపదార్థాలను, వ్యర్థాలను బయటికి పంపే ప్రధాన పని కిడ్నీలదే. అలా పంపించకపోతే ఏమవుతుందో తెలుసు కదా? అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం, నీళ్లు, అలవాట్లు కిడ్నీలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మూత్రపిండాలు ఆరోగ్యాన్ని దెబ్బతీసే పనులు చాలా మంది చేస్తున్నారు. ఇది వారికే ప్రమాదం. జాగ్రత్తలు తీసుకోకపోతే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, కిడ్నీలు పాడవడం... చివరికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ వరకు సమస్య చేరుతుంది. కాబట్టి చేయకూడని పనులు, చేయాల్సిన పనులు అన్నీ తెలుసుకుని కిడ్నీలను కాపాడుకోండి. 


1. మద్యపానం శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతేసే చెడు అలవాటు.ఇది మూత్రపిండాలను కూడా పాడు చేస్తుంది. వాటి పనితీరును మారుస్తుంది. కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. కాబట్టి మద్యపానం చేసే వాళ్లు హఠాత్తగా ఆపలేకపోతే కనీసం మోతాదు తగ్గించి, మితంగా తాగండి. 


2. ఉప్పు హైబీపీని తెచ్చి పెట్టడమే కాదు, మూత్రపిండాలను కూడా చెడగొడుతుంది. ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగని మరీ చప్పగా తినమని కాదు, మితంగా వేసుకుని తినాలి.రోజుకు అయిదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు శరీరంలో చేరకూడదు. 


3. తీపి పదార్థాలను ఇష్టపడే వాళ్లు ఎక్కువ మందే. మధుమేహం లేని వారు రోజుకో స్వీటు తినవచ్చు. రెండు మూడు స్వీట్లు తినడం ప్రారంభిస్తే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పంచదార కలిపిన పదార్థాల వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి తీపి పదార్థాలు తగ్గించాలి. 


4. చాలా మంది యూరిన్ వచ్చిన వెంటేనే వెళ్లరు. దాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇది తరచూ చేస్తుంటే మాత్రం చాలా ప్రమాదం. మూత్రం ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మూత్రం వచ్చిన వెంటనే వెళ్లడం మంచిది. 


5. ప్రోటీన్స్ ఉండే ఆహారం తినడం చాలా అవసరం. కానీ మోతాదుకు మించి అతిగా తినడం వల్ల కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి. అంటే రోజుకు రెండు గుడ్లు తినవచ్చు, కానీ కొంతమంది ఆరు నుంచి ఏడు గుడ్లు తింటుంటారు. గుడ్లలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీలు వాటి కోసం అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. 


6. నిద్ర అత్యవసరం. శరీరానికి తగినంత నిద్ర లేకపోయినా కిడ్నీలు సరిగా పరిచేయలేవు. కాబట్టి ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాడం ఉత్తమం. 


7. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతుంది. అలాగే కిడ్నీల పనితీరు కూడా మందగిస్తుంది. రోజుకు ఏడు గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగితే కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి.


8. మూత్రపిండాల ఆరోగ్యం కసం విటమిన్ ఎ, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా కలిగిన ఆహారాలను రోజూ తినాలి. దీని వల్ల మూత్ర పిండాల పనితీరు మెరుగుపడుతుంది. 


మూత్రపిండాలు చెడిపోయి ఎంతో మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆరోగ్యంతో, ఆర్ధికంగాను చితికి పోతున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా కిడ్నీలను కాపాడుకోవడం మంచిది. 


Also read: మృగశిర కార్తె రోజు చేపలు తినాలంటారు, ఎందుకో తెలుసా?


Also read: టైప్ 3సి డయాబెటిస్‌, ఇదీ మధుమేహంలో ఓ రకమే, మీది ఇదేనేమో చెక్ చేసుకోండి