మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును అంటారు పెద్దలు. అప్పటి వరకు రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది. అంతవరకు ఉన్న వేసవి తాపం తీరిపోతుంది. వాతావరణం మారడంతో శరీరం ఆ మార్పులను గ్రహించి సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఇలా చల్లబడిన వాతావరణం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగాలు ఉన్న వాళ్లు ఇబ్బంది పడతారు. మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోహిణి కార్తెలు ముగిసి, మృగశిర కార్తె మొదలైన మొదటి రోజే చేపలు తినడం ఆనవాయితీగా పూర్వం నుంచి కొనసాగుతోంది.ఇలా చేపలు తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమస్థాయిలో ఉండేలా ఇందులోని పోషకాలు చూసుకుంటాయి. జీర్ణశక్తి కూడా నెమ్మదించుకండా చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఈ ఏడాది జూన్ 8వ తేదీన బుధవారం నుంచి మృగశిర కార్తె మొదలవుతుంది. ఈ రోజున చేపల ధరలు ఆకాశాన్నంటుతాయి. అయితే ఈ రోజు చేపలు తింటే రోగాలు రావా? అని వాదించే వాళ్లూ ఉన్నారు.  అయితే చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలిస్తే మీరు కూడా ఈ రోజు చేపలు కచ్చితంగా తింటారు. 


చేపతో ఎన్నో లాభాలు
మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను ఇంగువ, చింతపండు లేదా చింత చిగురు కలిపి వండుకుని తినేవాళ్లు. ఇలా తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నది వారి నమ్మకం. మృగశిర కార్తెలో కలిగే వ్యాధుల నుంచి చేపల్లోని పోషకాలు రక్షణ కల్పిస్తాయని వారి భావన. గుండెజబ్బుతో ఉన్న వారు కచ్చితంగా చేపల్ని తినాలని చెబుతారు. వీటిల్లో 20రకాల ప్రొటీన్లు ఉంటాయి, అవన్నీ చాలా సులువుగా అరుగుతాయి. అలాగే మనకెంతో అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. లైసీన్, సిస్టీన్, మిథియోనిన్ అందులో ముఖ్యమైనవి. చేపల్లో దొరికే కొవ్వు కూడా మనకు అవసరమైనది. గర్భిణీలకు, గుండె జబ్బులు ఉన్నవారికి, పిల్లలకు ఈ కొవ్వు చాలా అవసరం. దీంతోనే చేప నూనెలను తయారు చేసి బయట అధిక ధరలకు అమ్ముతారు. ఈ కొవ్వులోనే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  దీని ద్వారా విటమిన్ ఎ, డి, ఇ లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో దొరికే విటమిన్ ఏ అధికం. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే కేవలం సూర్య రశ్మి ద్వారా మాత్రమే దొరికే విటమిన్ డి, చేప కొవ్వులో కూడా లభిస్తుంది. 


ఏ రూపంలో తిన్నా...
చేపల వేపుడు తింటారో, పులుసు చేసుకుంటారో లేక బిర్యానీ చేసుకుని తింటారో మీ ఇష్టం, ఎలా తిన్నా చేపల వల్ల లాభమే కానీ నష్టం లేదు అని వివరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. చేపల్లో ఇనుము అధికంగా లభిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. చేపల్లో అయోడిన్ కూడా దొరుకుతుంది. ఇది గాయిటర్ అనే జబ్బు రాకుండా అడ్డుకుంటుంది. మెదడు పనితీరుకు ఇది చాలా అవసరం. పిల్లల్లో మానసిక ఎదుగుదలకు అయోడిన్ సహకరిస్తుంది. కాబట్టి పిల్లలకు చేపలు తినిపించాలి. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో కూడా చేపలు ముందుంటాయి. వీటిలో ఉండే జింక్ కొన్ని రకాల ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఆ ఎంజైమ్‌లు చర్మాన్ని సంరక్షిస్తాయి. పెద్ద చేపల్లోని ముల్లును తినలేం కానీ చిన్న చేపల్లోని ముల్లును తినేయగలం. ఆ ముళ్లతో సహా తినడం వల్ల ఇనుము, కాల్షియం, భాస్వరం వంటివి దొరుకుతాయి. 


Also read: టైప్ 3సి డయాబెటిస్‌, ఇదీ మధుమేహంలో ఓ రకమే, మీది ఇదేనేమో చెక్ చేసుకోండి


Also read: మీకు లో బీపీ ఉందా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు