హైపర్ టెన్షన్ లేదా హైబీపీ... దీన్ని తీసుకున్నంత సీరియస్‌గా ‘లో బీపీ’ని తీసుకోరు. బీపీ తక్కువగా ఉండే సమస్యను హైపో టెన్షన్ అంటారు. రక్త పోటు తక్కువగా ఉండడం కూడా ఒక ఆరోగ్య సమస్యగానే పరిగణించాలి. హైబీపీ వస్తే రోజు మందులు వేసుకోవాలి. కానీ లో బీపీకి ఆ అవసరం లేదు. కేవలం కొన్ని జాగ్రత్తలు, మంచి ఆహారం ద్వారా తేరుకోవచ్చు. అందుకేనేమో బీపీ తక్కువగా ఉండడాన్ని పట్టించుకోవడం లేదు. బీపీ తక్కువగా ఉంటే ఏమవువుతుందో తెలుసా? చదవండి మరి.


లోబీపీతో వచ్చే చిక్కులు ఇవే...
చూపు మసకబారుతుంది. ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. మీకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు నిరాశగా ఫీలవుతుంటారు. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. తలనొప్పి తరచూ వస్తుంటుంది. చిన్న గాయం తగిలినా రక్త స్రావం అవుతుంది. రక్తపోటు తక్కువగా ఉన్న వారు... వాతావారణంలో మార్పులను కూడా సరిగా తట్టుకోలేరు. కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరగవచ్చు. అంతేకాదు గుండెపోటు, గుండెకు సంబంధించి రోగాలు వచ్చే అవకాశం ఉంది. 


ఎంత రక్తపోటు ఉంటే...
ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తపోటు 120/80 ఉంటుంది. అంతకన్నా ఎక్కువంటే హైబీపీకి చేరువవుతున్నట్టు లెక్క.అదే రక్తపోటు 90/60 లేదా అంతకన్నా తక్కువుంటే లోబీపీ కిందకి లెక్క. వీళ్లు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు. 


ఏం చేయాలి?
1. లోబీపీ లేదా హైపో టెన్షన్ తో బాధపడేవారు రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగాలి. నీళ్లు తగ్గితే డీహైడ్రేషన్ కు గురై రక్తపోటు ఇంకా తగ్గుతుంది.


2. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని అధికంగా తినాలి. 


3. లో బీపీ కదా అని ఉప్పు బాగా వేసుకుని తినవద్దు. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు సాధారణంగానే వేసుకుని తినాలి. 


4. ఆహారాల ద్వారానే లోబీపీ సాధారణ స్థాయికి వచ్చేలా చేసుకోవాలి. ఒకేసారి అధికంగా తినే బదులు చిన్న చిన్న భోజనాలుగా తింటే మంచిది. శక్తి నిరంతరం అందుతుంది.బీపీ తగ్గే ప్రమాదం తప్పుతుంది. 


5. లోబీపీ ఉన్న వాళ్లకి కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి. రోజుకో గ్లాసుడు కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది. 


6. నిద్ర తగ్గినా కూడా బీపీ ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి సరైన సమయానికి నిద్ర పోవాలి. కచ్చితంగా 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. 


7. పండ్ల రసాలు బీపీ పేషెంట్లకు మంచివి. ముఖ్యంగా లోబీపీ ఉన్న వాళ్లు దానిమ్మ, బీట్ రూట్ జ్యూసులు తాగితే మంచిది. 


8. సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా త్వరగా తేరుకోవచ్చు. చికెన్, గుడ్లు, పాప్ కార్న్, చీజ్,నిల్వ పచ్చళ్లు, సాస్‌లు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, బ్రెడ్డులు,క్యారెట్లు, టమాటోలు, బ్రకోలి, క్యాబెజీ, ముల్లంగి, కీరాదోస, ఎర్ర క్యాప్సికం వంటివి అధికంగా తినాలి. పెరుగన్నంలో కాస్త ఉప్పు వేసుకుని రోజుకోసారి తిన్నా మంచిదే. అలాగని మరీ అధికంగా పచ్చి ఉప్పును వాడకూడదు. 


Also read: ఆ మొటిమల మందులు బ్రెయిన్ ట్యూమర్‌కు కారణం కావచ్చు


Also read: సముద్రాలు లేకపోతే మనుషులు బతకగలరా? అవి లేని ప్రపంచం ఎలా ఉంటుంది?