బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణితులు ఏర్పడే ఒక ప్రమాదకరమైన ఆరోగ్యస్థితి. మెదడులో ఏర్పడిన కణితులను చికిత్స చేయడం చాలా కష్టం. శరీర పనితీరుపై ఆ కణితుల ప్రభావం పడుతుంది. నిజానికి కణితులు ఏర్పడినప్పటికీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తించలేరు. దానికి కారణం అవగాహన లేమి. కొన్ని రకాల లక్షణా ద్వారా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందేమో అని అనుమానించవచ్చు. 


1. తలనొప్పి తరచుగా రావడం
2. జ్ఞాపకశక్తి తగ్గడం
3. వాంతులు, వికారంగా అనిపించడం
4. చూపు మసకబారడం
5. విపరీతంగా అలసటగా అనిపించడం
6. సరిగా వినిపించకపోవడం
7. నడక తడబడడం
8. అధికంగా తిమ్మిర్లు పట్టడం
పై లక్షణాలన్నీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో కనిపిస్తాయి.ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. పై లక్షణాలు తరచూ వేధిస్తుంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని కలవాలి.బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కొన్ని రకాల మందులు కూడా కారణం కావచ్చని ఒక అధ్యయనం చెబుతోంది. 


ఈ చికిత్స వల్ల రావచ్చు
క్యాన్సర్, త్వరగా యుక్త వయసుకు రావడం, అధికంగా శరీరంలో జుట్టు పెరగడం, మొటిమలు అధికంగా రావడం వంటి సమస్యలకు అధునాత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హార్మోన్ల చికిత్స. ఈ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మహిళలకే ఈ హార్లోన్ల చికిత్సలు అవసరం పడుతుంటాయి. అయితే ఈ చికిత్స వల్ల మెదడులో కణితులు ఏర్పడే ప్రమాదం అధికమని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. 


ఇదే ఆ ఔషధం
సైప్రోటెరోన్ అసిటేట్ అనే మందును తీవ్రమైన మొటిమల సమస్యలున్న మహిళలకు ఇస్తారు. ఈ మందును ఇథినైల్ ఓస్ట్రాడియోల్ తో కలిపి స్టెరాయిడ్ లా మార్చి ఇస్తారు. ఈ స్టెరాయిడ్ అధికంగా వాడడం వల్ల మెదడులో కణితులు వచ్చే ప్రమాదం ఏడు రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి ఈ స్టెరాయిడ్ వాడిన వారు కచ్చితంగా బ్రెయిన్ స్కానింగ్ చేయించుకోమని సూచిస్తున్నారు. ఈ స్టెరాయిడ్ రోజుకు 25mg నుంచి 100mg వరకు వేసుకోమని ఇస్తుంటారు. ఇది మెనింగియోమా అనే బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే అవకాశాన్ని పది రెట్లు వరకు పెంచుతుంది. 


కాబట్టి ఇప్పటికే మొటిమలు తగ్గేందుకు, శరీరంపై అధిక జుట్టు పెరగకుండా అడ్డుకునేందుకు స్టెరాయిడ్లు వాడిన వారు, ఇతర హార్మోన్ల చికిత్సలు తీసుకున్న వారు ఓసారి బ్రెయిన్ స్కానింగ్ చేయించుకుంటే మంచిది.   


Also read: సముద్రాలు లేకపోతే మనుషులు బతకగలరా? అవి లేని ప్రపంచం ఎలా ఉంటుంది?