ఒకప్పుడు అన్నీ సముద్ర ప్రయాణాలే. విమానాలు వచ్చాక నీటిపై ప్రయాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. కేవలం సరుకులే రవాణా అవుతున్నాయి. అంతెందుకు విదేశీయులు మన గడ్డను చేరుకుంది కూడా సముద్రమార్గంలోనే. మనం భూమిపై ఎంత ఆధారపడి ఉన్నామో, పరోక్షంగా సముద్రాలపై కూడా అంతే ఆధారపడి జీవిస్తున్నాం. పర్యావరణ సమతుల్యానికి, మనిషి జీవించే వాతావరణం ఉండేందుకు సముద్రాలు ఎంతో సహకరిస్తున్నాయి. సముద్రాలే లేకుంటే మనిషి బతకడం కష్టతరంగా మారుతుంది. వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది.
ఎలా ప్రభావితం చేస్తుంది?
భూ వాతావరణాన్ని మార్చేది సముద్రాలే. భూమి పై వాతావరణ మార్పులపై సముద్రాలు చాలా ప్రభావం చూపిస్తాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా వర్షాలు, రుతు పవనాలు రాక సముద్రాల వల్లే వీలవుతుంది. రుతుపవనాలే రాకపోతే భూమి పరిస్థితి, భూమిపై నివసించే మనుషులు ఏమవుతారో ఓసారి ఊహించుకోండి. తుఫానులు, గాలులకు సముద్రాలే ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలను పూర్తిగా నియంత్రించేది సముద్రమే. అలాగే కొన్ని విషపూరితమైన వాయువులను కూడా సముద్రం పీల్చుకుంటుంది. దీని వల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదు. సముద్రాలు లేని భూమిపై మనిషి ఎంతో కాలం జీవించ లేడు. కరవు కాటకాలతో మానవజాతే అంతరించిపోతుంది.
ఆర్దికంగానూ...
సముద్రంలో ఉండే మత్స్య సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల మంది సముద్రంలోని జీవులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని అమ్ముకోవడం ద్వారా వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సముద్రాలు కోట్లాది మందికి ఆహార భద్రతలను, ఉపాధిని కల్పిస్తున్నాయి. 2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా 40 మిలియన్ల మంది ఉపాధి పొందుతారని అంచనా. సముద్ర గర్భంలో నూనె, సహజ వాయువు, విలువైన ఖనిజాలు లభిస్తాయి. వాటిని కూడా వెలికి తీస్తున్నారు.
సగం ఆక్సిజన్
భూమికి, భూమిపై జీవించే మనుషులకు కావాల్సిన ఆక్సిజన్లో సగం ఆక్సిజన్ ను అందించేది సముద్రాలే. భూమిపై జీవావరణ పరిస్థితులు కల్పించడంలో ప్రధాన పాత్రను ఇవే పోషిస్తున్నాయి. కానీ వీటినే కలుషితం చేసి సముద్ర జీవుల మరణానికి కారణం అవుతున్నాడు మనిషి. దీని వల్ల జీవావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం లోపిస్తుంది. ఇది తిరిగి మనిషిపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే సముద్రాల ప్రాధాన్యతను మనుషులకు చెప్పేందుకు ప్రతి ఏడాది జూన్ 8న ‘మహా సముద్రాల దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం.
ప్రపంచంలోనే అతి లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 35, 838 అడుగులు. 1960లో మనుషులు ఈ ప్రదేశానికి వెళ్లి వచ్చారు.