Stock Market Opening Bell on 8 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప నష్టాల్లో ఓపెనయ్యాయి. ఆర్బీఐ ద్వైమాసిక సమీక్షలో రెపోరేట్‌ పెంచడంతో మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. గతంలో మాదిరిగా వయలెంట్‌గా రియాక్ట్‌ అవ్వడం లేదు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్ల నష్టంతో 16,378, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 200 పాయింట్ల నష్టంతో 54,914 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 55,107 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,345 వద్ద లాభాల్లో మొదలైంది. 54,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,361 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 200 పాయింట్ల నష్టంతో 54,914 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే సూచీపై ఒత్తిడి కనిపించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్‌ పెంచడంతో మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నారు.


NSE Nifty


మంగళవారం 16,416 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,474 వద్ద ఓపెనైంది. 16,293 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,485 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో 16,378 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 35,165 వద్ద మొదలైంది. 34,840 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,182 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 54 పాయింట్ల లాభంతో 35,050 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్రిటానియా, నెస్లే ఇండియా, రిలయన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా మిగతా రంగాల సూచీలన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మీడియా, బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లకు గిరాకీ ఉంది. ఎఫ్‌ఎంసీజీ, ఆటో సూచీలపై ఒత్తిడి ఉంది.