Ram Gopal Varma on Jubilee Hills Gang Rape Case: సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచార ఘటన వ్యవహారంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)స్పందించారు. ఈ విషయంలో ఆర్జీవీ (RGV) బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకే మద్దతు పలికారు. రఘునందన్ రావు (Raghunandan Rao) చెప్పిందే నిజం అంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం కచ్చితంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఓ సాధారణ వ్యక్తి కోణం నుంచి తాను చూస్తున్నానని ఈ విషయంలో రఘునందన్ రావు వాదనే నిజం అని తనకు అనిపిస్తోందని అన్నారు. మిగతా వారు కేసును పక్కదారి పట్టిస్తున్నారని, ఇది విచారకరం అని అన్నారు.
‘‘జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విషయంలో ఒక కామన్ కోణం నుంచి చూస్తే రఘునందన్ రావు వాదనే కరెక్టుగా ఉందనిపిస్తుంది. మిగతా వారు కేసును పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఉంది. విచారకరం’’ అని రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్వీట్ చేశారు.
మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు ఏ - 1 అయిన సాదుద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. 3 రోజుల కస్టడీ రేపటి నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా సాదుద్దీన్ ఉన్నాడు. మరో ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నారు.
జువైనల్ కోర్టులోనూ పిటిషన్ దాఖలు
బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో సాదుద్దీన్ అనే ప్రధాన నిందితుడికి 18 ఏళ్లు. మిగతా వారు 18 ఏళ్ల లోపు వారు. ఈ మైనర్లను కూడా తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు పోలీసులు జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దాని విచారణ జరగాల్సి ఉంది. ఏ-1 అయిన సాదుద్దీన్ కు ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరినా, కోర్టు మూడు రోజుల అనుమతే ఇచ్చింది.