GHMC Corporators Meets PM Modi: తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం క్రమంగా పావులు కదుపుతోంది. బ్యాంక్ గ్రౌండ్‌లో అనేక రకాల వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ. అందుకోసం గత జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో మెరుగైన ఫలితాలు రావడంతో దాని ఆసరాగా మరింత జనాల్లోకి చొచ్చుకుపోయేలా బీజేపీ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోదీ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేట‌ర్లను ఢిల్లీకి పిలిచారు. వారితో భేటీ అయ్యారు. 


ప్రధాని పిలుపు మేర‌కు ఢిల్లీ వెళ్లిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ (GHMC) కార్పొరేట‌ర్లతో ప్రధాని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు గంట సేపటికి పైగా సమావేశం అయ్యారు. గత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటార‌ని కార్పొరేట‌ర్లను ప్రధాని అభినందించారు. రానున్న ఎన్నిక‌ల్లో మ‌రింత చురుగ్గా పని చేయాలని సూచించారు. పార్టీ వారికి అండ‌గా ఉంటుంద‌ని, హైద‌రాబాద్‌లో బీజేపీని బ‌లోపేతం చేసే దిశ‌గా ప్రతి ఒక్కరూ పని చేయాల‌ని మోదీ వారికి పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాని వారందరితో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు.


అయితే దేశ ప్రధాని కార్పొరేటర్లతో సమావేశం కావడం, వారికి పరిపాలన అంశాలపై సూచనలివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. ఈ ఫొటోను ప్రధాని ట్విటర్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.