Siddipet Electric Bike Fire: ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం ఎలా పెరుగుతోందో, అవి ప్రమాదానికి గురవుతున్న ఘటనలు అంతే ఎక్కువ అవుతున్నాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన బ్యాటరీతో నడిచే స్కూటర్లు కూడా పేలుతున్న, మంటలు రేగుతున్న ఘటనలు గతంలో జరిగాయి. తాజాగా సిద్దిపేటలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటి ముందు ఉంచిన ఎలక్ట్రిక్‌ స్కూటీ ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో పేలింది. దీంతో ఏకంగా ఇల్లు కూడా దగ్దం అయింది. 


ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పెద్ద చీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దుర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్‌ స్కూటీని పార్క్‌ చేశారు. అక్కడే ఛార్జింగ్ కూడా పెట్టారు. అయితే, అనుకోకుండా స్కూటీ నుంచి మంటలు చెలరేగి పేలింది. ఆ మంటలకు దుర్గయ్య ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా శబ్దం రావడంతో ఇంట్లోని వారు లేచి చూశారు. ఇంటికి కూడా నిప్పు అంటుకొని ఉండడంతో ఇంట్లోవారు ప్రాణ భయంతో బయటికి పరిగెత్తారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 


పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ ప్రస్తుతం ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్లే కాక, ఈవీ కార్లు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడు పోతున్నాయి. కార్ల విషయంలో పేలుళ్లకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ స్కూటర్లు తరచూ అగ్నిప్రమాదానికి గురవుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి.


Nizamabad Electric Bike Blast నిజామాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే..
కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ఘటనలో ఏడాదిన్నర క్రితం ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయగా.. బండి నుంచి బ్యాటరీని తీసేసిన తర్వాత ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసేవారు. ఆ రోజు కుటుంబ సభ్యులు పడుకున్నారు. అయితే, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు శబ్దం విని ప్రకాష్ హాలులోకి వచ్చాడు. పేలుడు కారణంగా మంటలు, పొగ హాలును కమ్మేశాయి. దీంతో వారంతా ఒక్క ఉదుటన ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడులో హాలులో పడుకున్న ప్రకాశ్ తల్లిదండ్రులు, కుమారుడికి గాయాలయ్యాయి.


గాయపడిన ముగ్గురిని వెంటనే నిజామాబాద్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. 80 ఏళ్ల రామస్వామి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మధ్యలో మృతి చెందాడు. ప్రకాష్ ఫిర్యాదు మేరకు థర్డ్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.