ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇప్పుడు కొత్తగా విద్యుత్ వినియోగదారులకు షాక్ పై షాక్ తగులుతోంది. పెంచిన ఛార్జీలు మే నెల నుండి అమలు కావడంతో కరెంట్ రెగ్యులర్ ఛార్జీలతో పాటు రకరకాల పేర్లతో వడ్డనలు కొనసాగుతున్నాయి. దీంతో అప్పటివరకూ వస్తున్న బిల్లులకు తగ్గట్టు అవసరాలకు వాడుకుంటున్న విద్యుత్ వినియోగదారులు ఒకేసారి పెరగడంతో.. అది కూడా మే లాంటి అధిక వినియోగం ఉండే నెలలో పెరగడంతో లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు ఒక్క ఇంటికి 0.50 పైసలు, కమర్షియల్ వినియోగానికి ఒక రూపాయి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెరిగిన ఈ చార్జీలకు తోడు కొత్తగా స్థిర చార్జీలు తోడై బిల్లులు భారీగా వస్తున్నాయి. ఈ విధంగా జిల్లాలోని వినియోగదారునుండి ఒక్క నెలలోనే దాదాపుగా పదిహేను కోట్లు అదనంగా వసూలు చేయడం బిల్లులు ఏ రేంజ్ లో మారుమోగుతున్నాయో అర్థమవుతుంది.
వీటికి అదనంగా గతంలో నగరంలో 2 కేవీఏ సామర్ధ్యం తో జారీచేసే మీటర్ కి దాదాపుగా 3310 రూపాయలు వసూలు చేసే వారు కానీ ఇప్పుడు 3 కెవిఏ కి పెంచిన మీటర్ కోసం వినియోగదారుడు 4930 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.
భారం పడుతోంది ఇలా...
ఫిక్స్డ్ చార్జీలు ఒక కేవీఏకు 20 చొప్పున ఎంత లోడ్ ఉంటే అంత మేరకు ప్రతి నెలా ఛార్జీల రూపంలో చెల్లించాలి. అంటే 5 కేవీఏ ఉన్నా వినియోగదారుడికి 100 రూపాయల అదనపు భారం పడుతోంది. దీనికితోడు కస్టమర్ చార్జీలు, ఎక్సైజ్ డ్యూటీ, టారిఫ్ డిఫరెన్స్ కరెంట్ చార్జీల పేరుతో వినియోగదారులపై మరింత భారం పడుతోంది. కేవలం మే నెలలోనే జిల్లాలో 2,82,210 విద్యుత్ సర్వీసులకు గానూ దాదాపుగా 51 లక్షల ఫిక్స్ డ్ ఛార్జీలను వసూలు చేశారు
ఎలా లెక్కిస్తారు??
సాధారణంగా కరెంట్ కనెక్షన్ తీసుకునే సమయానికి మనం వాడే వస్తువులను బట్టి మనకి కరెంట్ చార్జీలు వస్తూ ఉంటాయి. దీన్ని వారి లాంగ్వేజ్ లో శాంక్షన్ లోడ్ అంటారు. సాధారణ బల్బ్ నుండి ఎయిర్ కండిషన్ వరకు లెక్కిస్తే లోడ్ 5 నుండి 3 వేల వాట్ల వరకు ఉంటుంది. దీనికి అనుగుణంగానే సాంక్షన్ లోడ్ కూడా వసూలు చేస్తారు. ఒకవేళ ఒక ఇంట్లో కనుక కస్టమర్ అధికంగా కరెంట్ వినియోగించినట్లయితే వారికి సంబంధించిన మీటర్ లోడ్ మరింతగా పెంచుతారు. ఇలా పెంచినందుకు గాను అదనంగా ఒక్క కేవిఏ కి గానూ 1200, సెక్యూరిటీ డిపాజిట్ 200, జీఎస్టీ 18% కింద 216 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అర్థంకాని భాషలో సామాన్యుడి నడ్డి విరుస్తూనే విద్యుత్ చార్జీలు సైలెంట్ గా పెరిగిపోయాయి.