ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా విజయం ఖాయమే. ఈ మ్యాచులో కోహ్లీసేన విజయాన్ని అడ్డుకోవాలంటే న్యూజిలాండ్ అద్భుతమే చేయాలి. రోజులు బ్యాటింగ్ చేయాలి. మిగిలిన వికెట్లను కాపాడుకోవాలి. టీమ్‌ఇండియాకు మాత్రం మరో ఐదు వికెట్లు చాలు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్-2లో తొలి విజయం దక్కుతుంది. గెలుపు బోణీతో అభిమానులను మురిపించనుంది.
రెండో ఇన్నింగ్స్‌లో 540 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను రవిచంద్రన్ అశ్విన్ (3/27) భారీ దెబ్బకొట్టాడు. అతడు కీలకమైన వికెట్లు తీయడంతో మూడో రోజు ఆట ముగిసే సరికి కివీస్ 140/5తో నిలిచింది. రచిన్ రవీంద్ర (2 బ్యాటింగ్; 23 బంతుల్లో), హెన్రీ నికోల్స్ (36 బ్యాటింగ్; 86 బంతుల్లో 7x4) అజేయంగా నిలిచారు.
డరైల్ మిచెల్ (60; 92 బంతుల్లో 7x4, 2x6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టామ్ లేథమ్ (6), రాస్ టేలర్ (6), టామ్ బ్లండెల్ (0) నిరాశ పరిచారు. విల్ యంగ్ (20) ఫర్వాలేదనిపించాడు. కివీస్ గెలవాలంటే చివరి రెండు రోజుల్లో 400 పరుగులు చేయాలి. డ్రా చేసుకోవాలంటే 5 వికెట్లను రెండు రోజులు కాపాడుకోవాలి. అది జరిగే పనికాదు!
ఫామ్‌లోకి వచ్చినట్టే!
ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా 29 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన చెతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరినీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేలే ఔట్ చేయడం గమనార్హం. జట్టు స్కోరు 107 వద్ద మయాంక్, 115 వద్ద పుజారాను అతడు పెవిలియన్ పంపించాడు.
ఓపెనర్లు ఔటయ్యాక శుభ్‌మన్ గిల్ (47; 75 బంతుల్లో 4x4, 1x6), విరాట్ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు 144 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కీలక సమయంలో అర్ధశతకం ముందు గిల్‌ను రచిన్ రవీంద్ర ఔట్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శ్రేయస్ అయ్యర్ (14), విరాట్ కోహ్లీ ఔటయ్యారు. అయితే అక్షర్ పటేల్ (41*; 26 బంతుల్లో 3x4, 4x6) వేగంగా ఆడి సిక్సర్లు బాదేయడంతో టీమ్‌ఇండియా 276/7కి డిక్లేర్ చేసింది. మొత్తంగా కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ మ్యాచులో 14 వికెట్లు తీశాడు.
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి