ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు చేతికి బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని బరిలోకి దిగారు. లెజండరీ కోచ్, ముంబై మాజీ ఆటగాడు వాసు పరంజపే అలియాస్ వాసుదేవ్ పరంజపే మృతికి సంతాపంగా టీమిండియా ఈ రోజు మ్యాచ్‌లో బ్లాక్ ఆర్మ్ బాండ్స్ ధరించినట్లు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. వాసు పరంజపే గత సోమవారం గుండె పోటుతో మరణించారు.
వాసు క్రికెటర్‌గా అంతగా రాణించకపోయినా.. కోచ్‌గా మాత్రం ఎంతో సక్సెస్ అయ్యారు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లను ఆయన తీర్చిదిద్దారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ , రాహుల్ ద్రవిడ్ , సచిన్ టెండుల్కర్, యువ్‌రాజ్ సింగ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లు ఆయన శిష్యులే.
భారత్ x ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా మరోసారి ఘోరంగా విఫలమైంది. తొలి సెషన్లోనే కీలక వికెట్లను కోల్పోయిన భారత్ ఆ తర్వాత వికెట్ల పతనాన్ని కొనసాగించింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో మైలు రాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ రోజు మ్యాచ్లో కోహ్లీ వ్యక్తిగత స్కోరు 50 పరుగుల వద్ద ఔటయ్యాడు.