దాయాదుల మధ్య సమరం హిమాలయాలంత సమున్నతం! ఐసీసీ టోర్నీల్లో భారత్‌, పాక్‌ తలపడుతున్నాయంటే ప్రపంచమంతా ఏకమైపోతుంది. ఇక రెండు దేశాల అభిమానులు దానిని ఆటగా అస్సలు భావించరు. ఎందుకంటే వారిలో భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. బంతిబంతికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.


ఫలితం అటు.. ఇటైతే ఇండియాలోనైతే ఫర్వాలేదు! పాక్‌లో మాత్రం టీవీలు పగిలిపోతాయి. క్రికెటర్ల ఇంటి ముందు గొడవలు జరిగిపోతాయి. వీధుల్లో ఆందోళనలు మిన్నంటుతాయి. ఇప్పటి వరకు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కు తిరుగులేదు. ఐదుసార్లు ఆడితే ఐదుసార్లూ పాక్‌ను చిత్తు చేసింది. మరికొన్ని రోజుల్లో మరో మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో అప్పుడేం జరిగిందో మీకోసం!


India vs Pakistan, 2007, సెప్టెంబర్‌ 14: అరంగేట్రం ప్రపంచకప్‌లో దర్బన్‌ వేదికగా భారత్‌, పాక్‌ తలపడ్డాయి. ఈ లీగు మ్యాచ్‌ అద్భుతంగా జరిగింది. రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ బౌలౌట్‌కు దారితీసింది. ఏదేమైనా సెహ్వాగ్‌, భజ్జీ, ఉతప్ప వరుసగా వికెట్లకు బంతులు విసరడంతో 3-0 భారత్‌ విజయం అందుకుంది.






India vs Pakistan, 2007, సెప్టెంబర్‌ 24: భారత్‌, పాక్ లీగు మ్యాచే ఉత్కంఠ రేకెత్తిస్తే ఇక ఫైనల్‌ ఎలా ఉంటుందో తెలిసిందే! జోహన్స్‌ బర్గ్‌ వేదికగా మ్యాచ్‌ జరిగింది. మొదట గంభీర్‌ రాణించాడు. లక్ష్యాన్ని పాక్‌ దాదాపుగా ఛేదించేలా కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో జోగిందర్ శర్మ వేసిన బంతిని మిస్బా ఉల్‌ హక్‌ స్కూప్‌ ఆడబోయి శ్రీశాంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో భారత్‌ ప్రపంచకప్‌ అందుకుంది.






India vs Pakistan, 2012, సెప్టెంబర్‌ 30: ఈ సారి వేదిక కొలంబో. టీమ్‌ఇండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ ఏక పక్షంగా మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 128కే పరిమితమైంది. విరాట్‌ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్‌ కూడా తీసుకున్నాడు. లక్ష్యాన్ని భారత్‌ సులభంగా ఛేదించింది.


India vs Pakistan, 2014, మార్చి 21: వేదిక ఢాకాకు మారింది. మ్యాచ్‌ ఫలితంలో మాత్రం తేడా లేదు. భారత్‌ దెబ్బకు మ్యాచ్‌ ఏక పక్షంగా మారింది. పాక్‌ కేవలం 130కే ఆలౌటైంది. భారత్‌ తేలిగా గెలిచేసింది.


India vs Pakistan, 2016, మార్చి 19: ఈడెన్ గార్డెన్‌ వేదికగా జరిగిన మ్యాచులో టీమ్ఇండియా దుమ్ము రేపింది. అయితే భారత టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి మహ్మద్‌ ఆమిర్ వేసిన స్పెల్‌ మర్చిపోలేం. పాక్‌ 120 కన్నా తక్కువే చేసినా ప్రత్యర్థి గట్టిపోటీనిచ్చింది. ఆమిర్‌ భారత ఆటగాళ్లను వణికించాడు. స్కోరు ఎక్కువగా లేకపోవడంతో టీమ్‌ఇండియా గెలిచింది.






పాక్‌పై ఘన చరిత్ర ఉన్న టీమ్‌ఇండియా అక్టోబర్‌ 24న ఏం చేస్తుందో చూడాలి!!


Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు


Also Read: గబ్బర్ అవతారమెత్తిన కింగ్.. నీలో మంచి నటుడున్నాడయ్యా అంటున్న నెటిజన్లు!


Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి