జాతీయ గీతం..! జాతిని జాగృతం చేసే విజయ నినాదం!! ఎవరు పాడినా.. ఎక్కడ విన్నా తనువు పులకాంకితం అయిపోతుంది. అలాంటిది ఒలింపిక్‌ హీరోలు.. టోక్యోలో పతకాలు ముద్దాడిని భారత మాత ముద్దు బిడ్డలు.. జాతీయ గీతం ఆలపిస్తే ఎలా ఉంటుంది! రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.


73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ (IISM) ఇదే పని చేసింది. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన విజేతలతో జాతీయ గీతం ఆవిష్కరించింది. వారి కర్తవ్య దీక్షకు, పట్టుదలకు, కష్టాలను ఎదుర్కొన్న తీరుకు సెల్యూట్‌ చేసింది.


మొత్తం 18 మంది ఒలింపిక్‌ పతక విజేతలు ఈ వీడియోలో భాగమయ్యారు. నీరజ్‌ చోప్రా, రవికుమార్ దహియా, మీరాబాయి చాను, పీఆర్ శ్రీజేశ్‌, లవ్లీనా బోర్గోహెయిన్‌, సుమిత్ అంటిల్‌, మనీశ్ నర్వాల్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నాగర్‌, భావినా పటేల్‌, నిషాద్‌ కుమార్‌, యోగేశ్‌ కతూనియా, దేవేంద్ర ఝఝారియా, ప్రవీణ్‌ కుమార్‌, సుహాస్‌ యతిరాజ్‌, శరద్‌ కుమార్‌, హర్విందర్‌ సింగ్‌, మనోక్‌ సర్కార్‌ జాతీయ గీతాన్ని ఆలపించారు.



'గతేడాది ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతాలు చేశారు. ఈ ఏడాది ఆజాదీ అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందుకే ఐఐఎస్‌ఎం దర్శకత్వంలో జాతీయ గీతాన్ని విడుదల చేశాం. ఇందుకోసం తొలిసారి అథ్లెట్లందరికీ ఒకచోటకు తీసుకొచ్చాం. దేశంలోని యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకొనేలా ప్రేరణనివ్వడం, సాటి అథ్లెట్లు తమ క్రీడల్లో విజయాలు సాధించేందుకు స్ఫూ్ర్తినివ్వడమే దీని ఉద్దేశం' అని ఐఐఎస్‌ఎం ఫౌండర్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ కులకర్ణి అన్నారు.


'ఆటగాడిగానే కాదు ఒక సైనికుడిగా విదేశీ గడ్డపై జాతీయ గీతం వినడం గర్వంగా అనిపిస్తుంది. ఇతర దేశాల వారూ మన జాతీయ గీతం వచ్చేటప్పుడు గౌరవిస్తుంటే మరెంతో బాగుంటుంది. ఇది మాకెంతో గర్వకారణం' అని టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా అన్నాడు. 'స్టేడియంలో జాతీయ గీతం వస్తుంటే కలిగే ఫీలింగ్‌ను క్రీడాకారులు మాత్రమే అనుభవించగలరు. నీ బాధ్యతను గుర్తుచేయడమే కాకుండా రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. నీ కుటుంబం, పిల్లలు, స్నేహితులు, దేశవాసులను గుర్తు చేస్తుంది' అని హాకీ గోల్‌కీపర్‌ పీఆర్ శ్రీజేశ్ పేర్కొన్నాడు.


Also Read: Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 


Also Read: IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!


Also Read: Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!