WTC 227 India Schedule: తాజాగా టెస్టుల్లో తమను ఓడించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా స్కెచ్ వేసింది. వచ్చే 2027 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు కోసం భారత్ ఆరు సిరీస్ లను ఆడనుంది. రెండేళ్ల కాలంలో మూడేసి సిరీస్ ల చొప్పున ఇంటా, బయటా ఆడనుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔటైన నేపథ్యంలో వచ్చే డబ్ల్యూటీసీ టూర్ షెడ్యూల్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ పై పూర్తి అవగాహన వచ్చింది. మరోవైపు 2027 వరకు ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ పదవీ కాలం ఉండటంతో అతను ఈసారి ఎలాంటి ప్లాన్లు వేసి, టీమిండియాను ఫైనల్ కు చేరుస్తాడోనని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
కొన్ స్టాస్ కాచుకో..
ఇటీవల భారత్ తో సిరీస్ సందర్బంగా డెబ్యూ చేసిన ఆసీస్ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్ .. ఆ సిరీస్ లో కాస్త ఓవర్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాలుగో టెస్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత ఆటగాళ్లతో కయ్యం పెట్టుకున్న ఈ యంగ్ ప్లేయర్ భారత్ ఎప్పుడెప్పుడు వస్తాడా..? అని భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి ముహుర్తం ఖాయమైంది. 2027 జనవరి-ఫిబ్రవరి మాసాల్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడటానికి ఆసీస్ భారత్ కు రానుంది. అప్పటికి జట్టులో కొన్ స్టాస్ కు స్థానముంటే తను కూడా తప్పకుండా ఇండియన్ టూర్ చేయనున్నాడు. తను భారత గ్రౌండ్ లో బరిలోకి దిగితే తమ సత్తా చూపించాలని అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక డబ్ల్యూటీసీ 2027 సిరీస్ కు లకు సంబంధించి ఆరు వేర్వేరు ప్రత్యర్థులతో 18మ్యాచ్ లను భారత్ ఆడనుంది. అందులో ఐదేసి చొప్పున ఇంగ్లాండ్, ఆసీస్ లతో ఆడనుంది.
ఇంగ్లాండ్ పర్యటనతో శ్రీకారం..
డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 రేసును ఇంగ్లాండ్ పర్యటనతో ఆరంభించనుంది. ఐపీఎల్ 2025 ముగిశాక జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్ లో భారత్ పర్యటించనుంది. ఇందులో ఐదు టెస్టులను భారత్ ఆడనుంది. ఇది చాలా కఠినమైన సిరీస్ అనే చెప్పవచ్చు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ చాలా బలమైనది. అయితే గత పర్యటనలో భారత్ బాగా పోటీ ఇవ్వడంతో సిరీస్ డ్రా అయింది. ఈసారి కూడా సిరీస్ పోటాపోటీగా జరుగనుందని అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ తర్వాత వెస్టిండస్ తో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ ను అక్టోబర్ లో భారత్ ఆడనుంది. ఆ తర్వాతే అదే ఏడాది సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా.. భారత్ తన సొంతగడ్డపై డిసెంబర్ లో అమీ తుమీ తేల్చుకోనుంది. దీంతో ఈ ఏడాదిని ఇండియా ముగుస్తుంది.
ఇక చిత్రంగా 2026లో కేవలం నాలుగు టెస్టులను మాత్రమే భారత్ ఆడనుంది. అందులో తొలుత రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంకలో పర్యటనలో భాగంగా ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టులో జరుగుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ కు పర్యటనకు అక్టోబర్లో వెళ్లే భారత్, అక్కడ కూడా రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. తన సొంతగడ్డపై ఓడించిన కివీస్ ను.. దాని సొంతగడ్డపై ఓడించి రివేంజీ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
ఆ తర్వాత చివరగా ఆసీస్ తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ తో తన డబ్ల్యూటీసీ షెడ్యూల్ ను ముగిస్తుంది. ఈ సిరీస్ ల్లో సత్తా చాటి పాయింట్ల టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు భారత్ చేరనుంది. ఇక ఈ డబ్ల్యూటీసీ షెడ్యూల్ కాలంలోనే భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ కెరీర్లకు ముగింపు పలికే అవకాశముంది.
Also Read: Kohli Vs Gambhir: కోహ్లీ వరుసగా అలా ఔటవుతుంటే వారు ఏం చేస్తున్నారు? - యువరాజ్ తండ్రి సూటి ప్రశ్నలు