Ind Vs Aus Test Series Updates: భారత జట్టుకు టెస్టుల్లో గతేడాది అస్సలు కలిసిరాలేదు. ఏడాది చివర్లో వరుసగా రెండు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై అవమానకరరీతిలో 3-0తో ఓడిపోయింది. ఆ తర్వాత పుండు మీద కారం చల్లినట్టుగా ఆస్ట్రేలియా చేతిలోనూ 3-1తో ఓడిపోయి, పదేళ్ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌ను ఓడిపోయింది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. ఇక ఇప్పుడు అనుకోని చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. 46 ఏళ్ల తర్వాత వరుసగా రెండు టెస్టు సిరీసుల్లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 46 ఏళ్ల తర్వాత ఇలా ఓడిపోవడం అంటే భారత ప్రమాణాలు ఎంతగా పడిపోయాయో అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


1978లో తొలిసారి.. 
1977లో తొలిసారి ఇంగ్లాండ్ చేతిలో 3-1తో భారత జట్టు ఓడిపోయింది. ఈ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ 3-2తో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. నిజానికి కెర్రీ పాకర్ ప్రపంచ సిరీస్ సందర్భంగా కీలక ఆటగాళ్లు లేకపోయినా అనామక ప్లేయర్ల చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో వరుస టెస్టు సిరీస్ ల్లో మూడేసి మ్యాచ్ లు చొప్పున ఓడిపోయిన చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఇంతకాలం ఈ రికార్డు పదిలంగా ఉండగా, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి అదే ఫీట్ ను నమోదు చేసింది. మరోవైపు 2011-12 సీజన్ కూడా భారత టెస్టు సిరీస్ లో పీడకలగా నిలిచింది. అయితే ఆ ఏడాది ఇంగ్లాండ్ చేతిలో తొలుత 0-4తో వైట్ వాష్ కు గురైన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలోనూ 0-4తో క్లీన్ స్వీప్ కు గురై పరాజయం పాలైంది. అయితే మధ్యలో వెస్టిండీస్ తో  సిరీస్ లో రెండు విజయాలు సాధించి, పైన చెప్పిన చెత్త రికార్డు గురి కాకుండా తప్పించుకుంది. 


కోహ్లీ కెప్టెన్సీలో..
ఇక 2014-15లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను 3-1తో ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఆసీస్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు టెస్టులను డ్రా చేసుకోవడంతో మరోసారి ఈ చెత్త రికార్డు నుంచి బయట పడింది. ఏదేమైనా సొంతగడ్డపై కివీస్ తో జరిగిన సిరీస్ ను, అలాగే ఆసీస్ పర్యటనను మరిచి పోవాలని కోరుకుంటుంది. అలాగే వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోపీలో సత్తా చాటాలని భారత్ భావిస్తోంది. పాకిస్థాన్ లో జరిగే ఈ టోర్నీలో తన మ్యాచ్ లు యూఏఈలో భారత్ ఆడనుంది. తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న, పాక్ తో 23న లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. ఇక టెస్టు సిరీస్ లో గాయపడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేరుగా ఈ మెగాటోర్నీలోనే బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది. మధ్యలో ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.


Also Read: ICC 2 Tier Test System: టెస్టుల్లో ఐసీసీ విప్లవాత్మక మార్పులకు ప్రయత్నాలు.. టూ టైర్ సిస్టమ్ తో డబ్ల్యూటీసీకి మంగళం !