BGT Updates: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ బీజీటీలో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఐదు టెస్టులాడిన విరాట్ కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మూడు టెస్టులాడిన రోహిత్.. 31 పరుగులు చేసి ఉసూరుమనిపించాడు. ఇక ఈ సిరీస్‌లో ఎనిమిది సార్లు ఒకేరకంగా ఔటయిన కోహ్లీ టెక్నిక్‌పై పలువురు సందేహాలు లేవనెత్తుతున్నారు. పదే పదే ఆఫ్ స్టంప్ ఆవతల పడిన బంతిని గెలికి, ఉత్తి పుణ్యానికి ఔటవుతున్న కోహ్లీపై అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు ఫైరవుతున్నారు. ఇక ఆటగాళ్లు ఇలా విఫలమవుతుంటే కోచ్ గౌతం గంభీర్ ఏం చేస్తున్నాడని సున్నితంగా మాజీ క్రికెటర్ యువరాజ్ తండ్రి, యోగరాజ్ సింగ్ ప్రశ్నించాడు.
అండగా నిలవాలి..
గేమ్‌ను మించి ఏ ఆటగాడు పెద్ద కాదని, ఆటగాళ్లు వైఫల్యాల బారిన పడినప్పుడు వారు చేస్తున్న మిస్టేక్స్‌ను సరిదిద్దాలని టీమ్ మేనేజ్మెంట్‌తో పాటు గంభీర్‌కు సూచించాడు. వరుసగా ఒకే తరహాలో ఔటవుతున్న కోహ్లీ వ్యవహార శైలిని విశ్లేషించాడు. ఆఫ్ స్టంప్‌పై వస్తున్న బంతిని పుష్ చేసి కోహ్లీ ఔటువుతున్నాడని, ఇలాంటి షాట్లు సబ్ కాంటినేంట్ పిచ్‌లపై అటు ఇంగ్లాండ్ పిచ్‌లపై హిట్టవుతాయని గుర్తుచేశాడు. అసాధారణమైన బౌన్స్ ఉన్న ఆసీస్ పిచ్‌లపై ఇలాంటి షాట్లు ఆడితే బ్యాక్ ఫైరవుతుందని, కోహ్లీ విషయంలో అలాంటిదే జరిగిందని ఇలాంటి సమయంలోనే కోచ్, మేనేజ్మెంట్ కోహ్లీతో చర్చించి ఉండి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.
ఇండియాలో కోచ్ పని అదే..
భారత జట్టులో ఎంతో గొప్ప ఆటగాళ్లు ఉన్నారని సంప్రదాయ కోచింగ్ జట్టుకు అవసరం లేదని, ఆటగాళ్లు తప్పు చేస్తున్నప్పుడు వారిని సరిదిద్దడమే కోచ్ పని అని యోగ్ రాజ్ గుర్తు చేశాడు. అయితే రోహిత్ తోకానీ, విరాట్ తో కానీ వాళ్లు చేస్తున్న తప్పులపై విశ్లేషించి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. అలాగే సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా గంభీర్ లో ఉందని అతనో అద్భుతమైన ప్లేయరని వ్యాఖ్యానించాడు. ఇప్పటికైనా ప్లేయర్లందరితో కోచ్ మనస్ఫూర్తిగా మాట్లాడితే వైఫల్యాలను అధిగమించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇటీవల సీనియర్ల వైఫల్యంతో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో, ఇటు బీజీటీలో ఆసీస్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత భారత్ చూపంతా వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ పైనే నెలకొని ఉంది. ఈ టోర్నీలో గెలిచి విమర్శకలు నోళ్లు మూయించాలని జట్టు ఆటగాళ్లు గట్టి పట్టుదలగా ఉన్నారు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ లో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాక్ ఆడుతుంది. 20న బంగ్లాదేశ్ తో పోరును భారత్ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 23న పాక్, ఆ తర్వాత న్యూజిలాండ్ తో ఆడుతుంది.