Khamma Player Gongadi Trisha Creates History In U19 T20 World Cup: ఐసీసీ U19 టీ20 మహిళా ప్రపంచకప్‌లో భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష వరల్డ్ రికార్డ్ సొంత చేసుకుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లోనే సెంచరీ చేసి దుమ్మురేపింది. తక్కువ బంతుల్లో సెంచరీ త్రిష... ఐసీసీ U19 టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ సాధించారు. 


కౌలాలంపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో అండర్-19 భారత్ మహిళా టీం దూసుకెళ్తోంది. వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇవాళ స్కాట్లాండ్‌తో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్‌లో తెలుగు బ్యాటర్‌ గొంగడి త్రిష తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మొత్తంగా ఆమె 59 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలబడింది. ఇందులో 13 ఫోర్లు 4 సిక్స్‌లు కొట్టింది. అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా ఒక రికార్డు నమోదు చేసింది. అందులో తక్కువ బంతుల్లోనే ఆ రికార్డు సృష్టించింది త్రిష. 






స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందు భారత్ టాస్ ఓడిపోయింది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇందులో గొంగడి త్రిష 110 పరుగులు చేసింది.  ఓపెనర్ కమలిని 51 పరుగులు చేసింది. సానికా చల్కే 29 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన త్రిష, కమలి కలిసి ఏర్పరిచిన పార్టనర్‌షిప్‌ కూడా రికార్డే. వీళ్లిద్దరు కలిసీ తొలి వికెట్‌కు 147 పరుగులు చేశారు. 


Also Read: సిరీస్ పై భారత్ కన్ను.. మూడో టీ20లో గెలిస్తే సిరీస్ సొంతం.. ఫుల్ జోష్ లో టీమిండియా, ఒత్తిడిలో ఇంగ్లాండ్


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు 


ఉమెన్ క్రికెటర్ గొంగడి త్రిషపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. త్రిష సెంచరీ చేయడంపై సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మహిళల అండర్19 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ చేసి ప్రపంచ వేదికపై దేశ జెండా ఎగరేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు హృదయపూర్వక అభినందనలు అని రాసుకొచ్చారు. భద్రాచలం వాసిగా భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం గర్వకారణమని  కామెంట్ చేశారు. భవిష్యత్‌లో మరితంగా రాణించాలని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు.  


త్రిషలాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రజాప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇలాంటి వారికి తగిన గుర్తింపుని తెచ్చేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు సంకల్పించామని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించాలని క్రీడాకారులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Also Read: వారెవా వరుణ్ - ఫైఫర్‌తో విజృంభణ, ఇంగ్లాండ్ 171/9 .. సిరీస్ కైవసం దిశగా భారత్