Varun Fifer: వారెవా వరుణ్ - ఫైఫర్‌తో విజృంభణ, ఇంగ్లాండ్ 171/9 .. సిరీస్ కైవసం దిశగా భారత్
IND Vs ENG: బ్యాటింగ్‌కు స్వర్గధామమైన రాజకోట్ వికెట్‌పై ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు నిలువరించారు. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

India Vs England 3rd T20 Live Updates: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ సాధించేందుకు భారత్ ముందడగు వేసింది. వరుణ్ చక్రవర్తి (5/24) పాంచ్ పటాకాతో రెచ్చిపోవడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్‌కు దిగడం కలిసొచ్చింది. స్పిన్ ఆడటంలోని బలహీనతను మరోసారి ఇంగ్లాండ్ బయట పెట్టుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (28 బంతుల్లో 51, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియామ్ లివింగ్ స్టన్ (24 బంతుల్లో 43, 1 ఫోర్, 5 సిక్సర్లు) సిక్సర్లతో రెచ్చిపోయాడు. బ్యాటింగ్ కు స్వర్గధామమైన రాజకోట్ వికెట్‌పై ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు బాగా నిలువరించారు. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించినట్లవుతుంది. బౌలర్లలో హార్దిక్ పాండ్యాకు రెండు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది. చాలాకాలం తర్వాత పునరాగమనం చేసిన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మూడు ఓవర్లు వేసి వికెట్లేమీ తీయలేదు.
బ్యాటర్లు మళ్లీ విఫలం..
ఈ సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తి మరోసారి ఇంగ్లీష్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. వరుసగా రెండో సిరీస్ లోనూ ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. గతేడాది సౌతాఫ్రికా సిరీస్ పై కూడా తను ఫైఫర్ ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5) మరోసారి విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు చిక్కాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ (24)తో కలిసి డకెట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట రెండో వికెట్ కు 45 బంతుల్లోనే 76 పరుగులు జోడించింది. ఈ దశలో బాల్ ను చేతిలోకి తీసుకున్న వరుణ్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ప్రమాదకర బట్లర్ ను ఔట్ చేశాడు. ఇన్నింగ్ 9వ ఓవర్ చివరి బంతికి బట్లర్ రివర్స్ స్వీప్ ఆడగా, అది కీపర్ చేతుల్లో పడింది. అయితే అంపైర్ ఔటివ్వేలేదు. కీపర్ సంజూ.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను ఓప్పించి డీఆరెస్ తీసుకునేలా చేశాడు. రిప్లేలో ఎడ్జ్ ఉందని తేలడంతో బట్లర్ ఔటయ్యాడు. ఆ తర్వాత 26 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసుకున్న డకెట్.. కొద్ది సేపటికే పెవిలియన్ కు చేరాడు.
వరుణ్ విధ్వంసం..
ఒక దశలో 83/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్.. వరుణ్ తోపాటు భారత బౌలర్ల విజృంభణతో 127/8తో దయనీయమైన స్థితిలో నిలిచింది. డకెట్ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువగా క్రీజులో నిలవకపోవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించలేక పోయింది. హ్యారీ బ్రూక్ (8)ను ఈసారి బిష్ణోయ్ ఔట్ చేశాడు. జేమీ స్మిత్ (6), జామీ ఓవర్టన్ (0)లను వరుస బంతుల్లో వరుణ్ పెవలియన్ పంపి, హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్రైడెన్ కార్స్ (3) హ్యాట్రిక్ ను నిలువరించాడు. అయితే తనతోపాటు జోఫ్రా ఆర్చర్ (0) కూడా త్వరగానే పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. చివర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్ లో వరుసగా సిక్సర్లను లివింగ్ స్టన్ బాదడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక ఆఖర్లో ఆదిల్ రషీద్ (10 నాటౌట్), మార్క్ వుడ్ (10 నాటౌల్) పదో వికెట్ కు అజేయంగా 24 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ 170 పరుగుల మార్కును దాటింది.