Hardik Pandya News: ఇండియన్ క్రికెట్లో వైట్ బాల్ కెప్టెన్ అవసరం పడనుందని తెలుస్తోంది. ఏజ్ ప్రకారం చూసుకున్న వన్డేల్లో మరికొంతకాలమే రోహిత్ శర్మ ఆడనున్నాడు. ప్రస్తుతం 38వ పడిలో ఉన్న రోహిత్.. త్వరలోనే ఆట నుంచి విరమించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డేలు, టెస్టుల్లో అతడి వారసుని వేటలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వైట్ బాల్ క్రికెట్ ను తీసుకుంటే సినీయర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్ని విధాలుగా సరిపోతాడని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ఒక లోపాన్ని సవరించుకుంటే అతడికి తిరుగుండదని చెబుతున్నారు. బీసీసీఐ మారిన ప్రాధన్యతల రిత్యా దేశవాళీల్లో ఆడటంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు అంతగా డొమెస్టిక్ క్రికెట్ ను హార్దిక్ ఆడటం లేదు. టెస్టులపై విముఖంగా ఉన్న పాండ్యా.. వైట్ బాల్ క్రికెట్ పగ్గాలు చేపట్టాలంంటే అటు వన్డే, ఇటు టీ20ల్లో దేశవాళీల్లో రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వచ్చినప్పటి నుంచి చాలా పారామీటర్లను చూస్తున్నారు.
అందుకే టీ20 కెప్టెన్ కాలేకపోయాడా..?
గతేడాది వెస్టిండీస్ లో టీ20 ప్రపంచకప్ నెగ్గాక, భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా రోహిత్ వారసుడిగా సూర్య కుమార్ యాదవ్ ను భారత టీ20 కెప్టెన్ గా ఎంపిక చేశారు. పై కారణాలతోనే హార్దిక్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక పేస్ ఆల్ రౌండర్ కావడంతో హార్దిక్ ఫిట్ నెస్ ను పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం వన్డే క్రికెట్ పగ్గాలు చేపట్టాలంటే హార్దిక్.. అటు ఫిట్ నెస్ ను మెరుగు పర్చుకోవడంతోపాటు కెప్టెన్ గా దేశవాళీల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్, భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రోహిత్ ను తప్పిస్తే, పగ్గాలు చేపట్టడానికి హార్దిక్ కు అవకాశముంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ధోని స్థాయి ఫినిషర్..
మరోవైపు వన్డే క్రికెట్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పోషించిన ఫినిషర్ రోల్ ను పాండ్యా రిపీట్ చేయాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇప్పటికే పలు ఐసీసీ టోర్నమెంట్ లో తన విలువను పాండ్యా చాటి చెప్పాడని గుర్తు చేశాడు. అయితే ఫిట్ నెస్ కు పరీక్ష పెట్టే వన్డేల్లో నిరూపించుకుంటే పాండ్యాకు తిరుగుండదని పేర్కొన్నాడు. బౌలింగ్ లో ఆరెడు ఓవర్లు వేసి, 5-6 స్థానంలో బ్యాటింగ్ చేసి ఫినిషర్ గా రూపుదిద్దుకోవాలని సూచించాడు. ఇందుకోసం ఫిట్ నెస్ లెవల్ ను పెంచుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నాడు.
ఫినిషర్ అంటే చివర్లో వచ్చి స్కోరు వేగం పెంచడమే కాదని, జట్టు కష్టాల్లో ఉన్న స్థితిలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధించాల్సిన అవసరముందని తెలిపాడు. గతంలో పాండ్యా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినా, మరింతగా తన ఆటతీరును డెవలప్ చేసుకుంటే, వన్డే కెప్టెన్ గా అతడిని పరిగణనలోకి తీసుకుంటారని అన్నాడు. ఇక రాబోయే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తోపాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో హార్దిక్ కు సువర్ణావకాశాలు లభించాయి. పైన చెప్పినట్లు ఇందులో నిరూపించుకుంటే పాండ్యాకు తిరుగే ఉండదు. ఇప్పటివరకు 86 వన్డేలు ఆడిన పాండ్యా 84 వికెట్లు తీశాడు. 110కిపైగా స్ట్రైక్ రేట్ ను కలిగి ఉన్నాడు.