Pak Vs Wi Test Series: పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్.. ఆ దేశ మీడియాపై ఫైరయ్యాడు. సోమవారం వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో పాక్ 120 పరుగులతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మసూద్ కాస్త ఇరిటేట్ అయ్యాడు. సుతిమెత్తగానే అతనికి జవాబు చెబుతూ, కాస్త కఠినంగానే మాట్లాడాడు. ప్లేయర్ల పట్ల అగౌరవంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేశాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పాక్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి, కొంతమంది సమర్థిస్తూ, కొంతమంది విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
దిగి పోతారా.. లేక తొలగిస్తారా..?ఇంతకీ ఈ వీడియోలో ఆ జర్నలిస్టు.. మసూద్ ను సూటిగా ప్రశ్నించాడు. ఇప్పటివరకు జరిగిన రెండు ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసుల్లో పాక్ అట్టడుగున నిలిచిందని, కిందటి సారి కంటే ఈసారి ఘోరంగా 9వ స్తానంతో ముగించిందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై బలహీనమైన వెస్టిండీస్ లాంటి జట్టుతో కూడా ఓడిపోవడంపై పెదవి విరిచాడు. ఈక్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తుందా..? లేక మీరే దిగిపోతారా..? అని కాస్త వెటకారం దట్టించి అడిగాడు. ఈ ప్రశ్నకు మసూద్ కాస్త ఇరిటేట్ అయినట్లు సమాధానమిచ్చాడు. ప్రశ్నలు ఎలాంటివైనా అడగొచ్చని, అయితే ప్లేయర్లు, కెప్టెన్ల పట్ల అగౌరవంగా మాత్రం ఉండకూడదని మసూద్ చురకలు అంటించాడు. తాము దేశం కోసం ఆడుతున్నామని, జయాపజయాలు తమ చేతిలో ఉండబోవని గుర్తు చేశాడు. సొంతగడ్డపై జరిగిన గత నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలుపొందామని, నాలుగో టెస్టులో కూడా తొలి రోజు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్లే ఓడిపోయామని తెలిపాడు. ఏదేమైనా ప్రశ్నల విషయంలో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని అడగమన్నట్లుగా ఫైరయ్యాడు.
133 పరుగులకే కుప్పకూలిన పాక్..ఇక సోమవారం ముల్తాన్ లో ముగిసిన రెండోటెస్టులో పాక్ 120 పరగులతో ఘోర పరాజయం పాలైంది. 254 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. 44 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. జట్టులో బాబర్ ఆజమ్ (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 163 పరుగులు చేయగా, పాక్ 154 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసిన విండీస్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 9 పరుగులు కలుపుకుని 254 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది. అయితే ఛేదనలో జోమెల్ వర్రీకన్ (5/27) ధాటికి త్వరగానే కుప్పకూలింది. ఇక మ్యాచ్ లో 9 వికెట్లతో పాటు 36 పరగులు చేసిన వర్రికన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే సిరీస్ లో 85 పరుగులు, 19 వికెట్లు కూడా వర్రీకనే తీసి, టాప్ లో నిలవడంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లో వెస్టిండీస్ 8వ స్థానంలో నిలవగా, పాక్ అట్టడుగున 9వ స్థానానికి పడిపోయింది.