Team India News: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో టీ20 పోరుకు సిద్ధమైంది. రాజకోట్ వేదికగా మంగళవారం ఇరుజట్ల మధ్య మూడో టీ20 జరుగుతుంది. సిరీస్ లో వరుస విజయాలతో భారత్ దూసుకుపోతోంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి 2-0తో ఇండియా ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక మ్యాచ్ వేదికైన నిరంజన్ షా మైదానం కూడా భారత్ ఎంతో అచ్చొచ్చింది. ఇక్కడ ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ నాల్గింటిలో విజయం సాధించింది. చివరగా న్యూజిలాండ్ చేతిలో 2017లో పరాజయం పాలైంది. అంటే గత ఎనిమిదేళ్లుగా అజేయ రికార్డును ఇక్కడ నమోదు చేస్తోంది. ఈక్రమంలో మంగళశారం మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోవాలని భావిస్తోంది. 






భారీ విజయాలు.. 
ఈ వేదికపై ఇండియా భారీ విజయాలను సాధించింది. గతేడాది జనవరి 7న శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో 91 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. ఇక తొలిసారిగా 2013లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో ఆరు వికెట్లతో సునాయాసంగా భారత్ గెలుపొందింది. ఆ తర్వాత 2017లో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో 40 పరుగులతో ఓడిపోయినా, 2019లో బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో తిరిగి గెలుపు గుర్రాన్ని ఎక్కింది. ఆ మ్యాచ్ లో 8 వికెట్లతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జూన్ 17, 2022న జరిగిన మ్యాచ్ లో 82 పరుగులతో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అచ్చొచ్చిన మైదానంలో మంగళవారం కూడా విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. 


ఫుల్ జోష్ లో టీమిండియా..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో భారత్ టాప్ నాచ్ గా ఉంది. బ్యాటర్లు భీకర స్కోర్లతో పరుగులు చేస్తున్నారు. తొలి టీ20లో అభిషేక్ శర్మ దూకుడుతో సునాయసంగా గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో మాత్రం కాస్త కష్టపడింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో రెండు వికెట్లతో గెలుపొందింది. అయితే ఈ సారి మాత్రం ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా ఘనవిజయం సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతామని ఇండియాకు వచ్చిన ఇంగ్లాండ్ తంటాలు పడుతోంది. ముఖ్యంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ తేలిపోతుంది. జట్టు కూర్పు విషయంలోనూ ఇబ్బంది పడుతోంది. గత మ్యాచ్ లో స్పిన్నర్లు లేక ఇబ్బంది పడింది. ఇక నేటి మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ లో నిలుస్తుంది. ఈక్రమంలో అన్ని శక్తులు ధారపోసి మ్యాచ్ ను గెలవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. జట్టు కూర్పులో కొన్ని మార్పులు ఉండే అవకాశముంది. అదనపు స్పిన్నర్ ను తీసుకునే అవకాశముంది. ఏదేమైనా ఈ మ్యాచ్ కూడా మరింత జోష్ ను పంచాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.  


Also Read: Hardik Pandya Captaincy: టీ20 కెప్టెన్ గా పాండ్యాను అందుకే తీసుకోలేదా..? అవి సరిచేసుకుంటే సరి..