ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు టాప్ లేపింది. ఇటీవల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌పై క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, ట్వీ 20 సిరీస్‌లో సైతం జయభేరి మోగించింది. వెస్టిండీస్‌పై 3-0తో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించింది.
ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. విండీస్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. తద్వారా 3-0తో వైట్ వాష్ చేసిన భారత్‌కు కలిసొచ్చింది. భారత్ 269 పాయింట్ల (10,484)తో నెంబర్ వన్ (ICC T20I Rankings Team India)గా నిలవగా, 10,474 బేసిస్ పాయింట్లతో ఇంగ్లాండ్ 2వ స్థానంలో ఉంది. 266 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్, 255 పాయింట్లతో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా 253 రేటింగ్ పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్నప్పటికీ ఆస్ట్రేలియా ర్యాంకు ఏమాత్రం మారలేదు. 249 పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాకింగ్స్ లో ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లాండ్ జట్టు త్వరలో ఆడే సిరీస్‌లో వరుస విజయాలు సాధిస్తే అగ్రస్థానానికి తిరిగి ఎగబాకే అవకాశం ఉంది.
భారత్ జైత్రయాత్ర..
ఇదివరకే 2 టీ20లు గెలిచిన భారత్ ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ విజయం సాధించి విండీస్ పై మరో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన సూర్యకుమార్ యాదవ్ (65: 31 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా... రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
Also Read: Gujarat Titans Metaverse: గుజరాత్ టైటాన్స్ లెక్కే వేరబ్బా! మెటావెర్స్‌లో లోగో ఆవిష్కరించింది