KKR vs PBKS: ఐపీఎల్-16లో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచినా కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి నితీశ్ రాణాకు షాక్ తప్పలేదు. గెలిచిన ఆనందంలో ఉన్న అతడికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాకిచ్చింది. పంజాబ్ తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను రాణాకు రూ. 12 లక్షల జరిమానా పడింది.
ఈ మేరకు కోల్‌కతా - పంజాబ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను రాణాకు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నాం..’అని ప్రకటనలో పేర్కొంది.
ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గతంలో ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించిన ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్, కేకేఆర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్, లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్, గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాలు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కున్నవారే. ఈ జాబితాలో నితీశ్ రాణా కూడా బాధితుడిగా చేరాడు.
లాస్ట్ బాల్ థ్రిల్లర్‌కు కేకేఆర్ విక్టరీ..
సోమవారం ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ సారథి శిఖర్ ధావన్.. 47 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. మూడు వికెట్లు తీయగా హర్షిత్ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కేకేఆర్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ కు విక్టరీ కొట్టింది. జేసన్ రాయ్ (38), నితీశ్ రాణా (51) రాణించగా ఆఖర్లో ఆండ్రీ రసెల్.. 23 బంతుల్లో 3 సిక్సర్లు, 3 బౌండరీలతో 42 పరుగులు చేయగా రింకూ సింగ్.. 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 21 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి ఆరు పరుగుల అవసరం కాగా అర్ష్‌దీప్ బాగానే కట్టడి చేసినా చివరి బంతికి రింకూ బౌండరీ కొట్టి కేకేఆర్‌కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.