Ind Playing XI Updates: ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు భారత్ సిద్ధమైంది. ఇక్కడికి చాలా రోజుల కిందటే చేరుకున్న భారత్.. తన సన్నాహకాలు ప్రారంభించింది. ఇప్పటికే ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ఆడింది. అయితే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత ప్లేయింగ్ లెవన్ పై కాస్త స్పష్టత వచ్చింది. తాజాగా భారత విధ్వంసక వికెట్ కీపర్ కమ్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్.. టీమిండియాలోని రెండు స్థానాలపై క్లారిటీ ఇచ్చాడు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నాలుగో నెంబర్లో ఎవరు బ్యాటింగ్ చేయనున్నారో తెలిపాడు. జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ ఈ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని పేర్కొన్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఈ స్థానంలో బ్యాటింగ్ కి దిగి పరుగుల వరద పారించారు. ఆ స్థానానికే ఒక వన్నె తెచ్చారు. అలాంటి స్థానంలో కెప్టెన్ గిల్ బ్యాటింగ్ కు వస్తాడని తెలిపాడు.
తనెక్కడ ఆడతాడంటే..?ఇక తన రెగ్యులర్ స్థానమైన ఐదో నెంబర్లోనే బ్యాటింగ్ కు దిగుతానని పంత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో అన్ని రంగాల్లో తన ప్రతిభ చాటాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తోపాటు ఫీల్డింగ్ లోనూ రాణించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రతి మ్యాచ్ కు ముందు తను ఇలాగే భావిస్తానని, అందులో ఎలాంటి మార్పులేదని పేర్కొన్నాడు. కెప్టెన్ గిల్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆఫ్ ఫీల్డ్ లోనూ తాము సరదాగా ఉంటామని వ్యాఖ్యానించాడు. ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటేనే, అది ఫీల్డ్ లోనూ ప్రతి ఫలిస్తుందని పేర్కొన్నాడు.
నెం.3లో నో ఐడియా..ఇప్పటివరకు గిల్ నెం.3లో బ్యాటింగ్ చేసేవాడు. అతను ఆ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఎవరు ఆడతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. అయితే అనుభవం కల అభిమన్యు ఈశ్వరన్ లేదా యువ సంచలనం సాయి సుదర్శన్ లో ఎవరిని ఈ స్థానంలో ఆడిస్తారనేదానిపై స్పష్టత లేదు. ఈ విషయంపై టాస్ వేశాక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. నెం.3లో ఎవరు ఆడతారు అనేది తనకు తెలియదని , దీనిపై చర్చలు జరుగుతున్నట్లు పంత్ పేర్కొన్నాడు. ఇక ఈనెల 20 నుంచి లీడ్స్ లో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవన్ ను ప్రకటించింది. భారత్ కూడా తన జట్టు కూర్పుపై తుది కసరత్తు చేస్తోంది.