Jofra Archer Ruled Out: ఐపీఎల్-16లో పడుతూ లేస్తూ  (10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి ఐదు ఓడింది) ప్లేఆఫ్  పోరులో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగలింది.  ఆ జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సీజన్   ప్రారంభం నుంచి  కాలి గాయంతో సావాసం చేస్తున్న  ఆర్చర్ ఫిట్‌నెస్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో  ముంబై ఆడిన అన్ని మ్యాచ్‌లు ఆడలేదు.  ఇప్పుడు ఫిట్‌నెస్ సమస్యలతో  సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. 


‘జోఫ్రా ఆర్చర్ స్థానంలో మిగిలిన సీజన్‌కు క్రిస్ జోర్డాన్  ముంబై జట్టుతో చేరతాడు.  ఫిట్‌నెస్ ఇష్యూస్ తో ఉన్న ఆర్చర్  ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పర్యవేక్షణలో ఉంటాడు’ అని ముంబై  ట్విటర్ లో తెలిపింది. ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన  జోర్డాన్  9.50 ఎకానమీ రేట్ తో  రెండు వికెట్లు మాత్రమే తీశాడు.   


 






గత సీజన్ కు ముందు నిర్వహించిన ఐపీఎల్ వేలంలో  ఆర్చర్ ను ముంబై ఇండియన్స్  రూ. 8 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కానీ గాయం కారణంగా అతడు ఆ సీజన్ ఆడనేలేదు. ఈ సీజన్ లో కూడా  ఐదు మ్యాచ్‌లు ఆడినా అతడి ప్రభావం శూణ్యం.  ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమవడంతో   ఆ జట్టు ఆర్చర్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.  కానీ ఆర్చర్ వాటిలో వన్ పర్సెంట్ కూడా   అందుకోలేదు.


ఇక ఆర్చర్ స్థానాన్ని మరో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ భర్తీ చేయనున్నాడు.  నేడు ఆర్సీబీతో వాంఖెడే వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో అతడు ఆడనున్నట్టు తెలుస్తున్నది.  జోర్డాన్ ను ముంబై  రూ. 2 కోట్ల కనీస ధరతో  జట్టులోకి తీసుకుంది. వారం రోజుల క్రితమే ముంబై ఇండియన్స్ క్యాంప్ లో చేరిన జోర్డాన్ ఇప్పటిదాకా  ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నేడు అతడు ముంబై తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్ లో 2016లో ఎంట్రీ ఇచ్చిన జోర్డాన్.. ఇప్పటివరకు 28 మ్యాచ్ లలో  27 వికెట్లు పడగొట్టాడ. టీ20 స్పెషలిస్టు బౌలర్ అయిన జోర్డాన్.. ఇంగ్లాండ్ తరఫున 87 మ్యాచ్‌లలో 96 వికెట్లు తీశాడు.  గత సీజన్ నుంచి  పేలవ బౌలింగ్‌తో తీవ్ర ఇక్కట్లు పడుతున్న ముంబైకి జోర్డాన్ ఏ మేరకు  సహకరిస్తాడో చూడాలి.