Raina on Dhoni Retirement: ఐపీఎల్-16 జోరుగా సాగుతున్నా ఈసారి ప్లేఆఫ్స్‌కు ఏ టీమ్స్ వెళ్తాయి..? ట్రోఫీ ఎవరు గెలుస్తారు..? అన్న చర్చ కంటే ఈ సీజన్ తర్వాత ధోని మళ్లీ ఆడతాడా..? ఆడడా..? అన్నదానిమీద జోరుగా చర్చ సాగుతోంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌లు (జియో, స్టార్) ఇదే ధోని ఆఖరి సీజన్ అని రేటింగ్ లు పెంచుకుంటున్నాయి.
మరోవైపు ఈ చర్చపై ధోని ఎప్పటికప్పుడూ స్పందిస్తూనే ఉన్నా స్పష్టమైన ప్రకటన మాత్రం చేయడం లేదు. నాలుగైదు రోజుల క్రితం లక్నోతో మ్యాచ్ లో కూడా కామెంటేటర్ డానీ మోరిసన్ తో కూడా ‘ఇది నా చివరి సీజన్ అని మీరు డిసైడ్ చేశారు. నేను కాదు..’ అని కామెంట్స్ చేశాడు. తాజాగా ఇదే విషయమై ధోని సన్నిహితుడు, పదేండ్ల పాటు తమిళ తంబీలు ‘చిన్న తాల’గా పిలుచుకున్న సురేశ్ రైనా కీలక అప్డేట్ ఇచ్చాడు.
ఇటీవలే చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై - ముంబై మ్యాచ్ లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చిన రైనా ధోని రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ‘‘అందరూ ఇదే విషయం అడుగుతున్నారు. దీని గురించి నువ్వేమనుకుంటున్నావ్ అని అడగ్గా ధోని నాతో ‘ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఏడాది ఆడతా. అప్పుడు చూద్దాం’ అని నాతో చెప్పాడు’’ అని రైనా చెప్పాడు.
టైటిల్ వేటలో..
చిన్న తాల వ్యాఖ్యలను బట్టి చూస్తే గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న సీఎస్కేను ఈసారి విజేతగా నిలిపేందుకు ధోని ఫిక్స్ అయినట్టున్నాడనే అనిపిస్తున్నది. అందుకు అనుగుణంగానే చెన్నై కూడా ఈ సీజన్ లో నిలకడైన ప్రదర్శనలతో ప్లేఆఫ్ దిశగా ముందంజ వేస్తున్నది. ఇప్పటివరకు ఐపీఎల్-16లో 11 మ్యాచ్ లు ఆడిన చెన్నై.. ఆరింటిలో గెలిచి నాలుగు ఓడింది. లక్నోతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై.. తదుపరి మ్యాచ్ ను రేపు (మే 10) ఢిల్లీతో ఆడనుంది. ఈ సీజన్ లో చెన్నై ఇంకా మూడు మ్యాచ్ లు ఆడనుంది. ఈ మూడింట్లో రెండు గెలిచినా సీఎస్కే ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకున్నట్టే..
చెన్నై రాబోయే మ్యాచ్‌లు :
1. చెన్నై వేదికగా మే 10న ఢిల్లీతో..
2. చెన్నై వేదికగా మే 14న కోల్‌కతాతో..
3. ఢిల్లీ వేదికగా మే 20న ఢిల్లీతో..