Karun Nair Injury: ఇంగ్లాండ్ తో శుక్రవారం ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత్ కు షాక్ తగిలింది. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా, ప్రసిధ్ కృష్ణ వేసిన బంతి బలంగా తాకడంతో గాయపడ్డాడు. కాస్త ఎత్తులో వచ్చిన బంతిని ఆడటంలో కరుణ్ ఫెయిల్ కావడంతో అది నేరుగా వచ్చి, కరుణ్ పక్క టెముకలకు తాకింది. దీంతో కాస్త నొప్పితో విలవిలలాడిన కరుణ్.. ఆ తర్వాత చికిత్స తీసుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించాడు. అయితే కరుణ్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. హెడీంగ్లీలో రేపు జరగబోయే మ్యాచ్ లో తను ఆడతాడో లేదో అనే దానిపై స్పష్టత లేదు. దాదాపు 8 ఏళ్ల తర్వాత తనకు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇటీవల దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ముఖాలకు చోటు దక్కింది.
ట్రిపుల్ సెంచరీ తర్వాత..నిజానికి భారత్ కు ఆడిన చివరి టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వివిధ రకాల కాంబినేషన్లతో అతనికి జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధించడంతో సెలెక్టర్లు తనను జట్టులోకి ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ తో శుక్రవారం జరిగే మ్యాచ్ లో తను కచ్చితంగా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రోకో ద్వయం రిటైర్మెంట్ తర్వాత డ్రెస్సింగ్ రూం వాతావరణంపై సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్పందించాడు.
ఇలా ఎప్పడూ లేదు..రోహిత్, కోహ్లీ లేకుండా తానెప్పుడు టెస్టులను ఆడలేదని, తొలిసారి వీరిద్దరూ లేకుండా టెస్టు మ్యాచ్ ఆడుతున్నానని కాస్త భాగోద్వేగంతో రాహుల్ చెప్పాడు. తను ఇప్పటివరకు 50 టెస్టులు ఆడినప్పటికీ, తాజా అనుభవం కొత్తగా ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా రోకో ద్వయం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, దేశం కోసం వారెంతో చేశారని తెలిపాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై రాహుల్ కు మంచి రికార్డే ఉంది. అదే రకమైన ఆటతీరును ప్రస్తుత టెస్టు సిరీస్ లోనూ కొనసాగించాలని అతను కోరుకుంటున్నాడు. ఇక ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ట్రోఫీకి పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారు. ఈసారి నుంచి ఈ ట్రోఫీ పేరును టెండూల్కర్-అండర్సన్ పేరుతో పిలవనున్నారు. తాజాగా ఐసీసీ ఈ ట్రోఫీని ఆవిష్కరించింది. సిరీస్ గెలిచిన కెప్టెన్ కు పటౌడీ మెడల్ ను బహుకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఓవరాల్ గా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగుతాయి.