Ind Vs Eng Test Series Latest Updates: శుక్రవారం నుంచి ఇంగ్లాండ్ తో తొలి టెస్టు సందర్భంగా భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. గత ఐదేళ్లలో తమ సీనియర్లు అందించిన బ్లూ ప్రింట్ ప్రకారం.. ప్రతి చోట గెలవడమే టార్గెట్ గా ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక జట్టు విజయబాటలో నడవాలంటై జట్టులో సరైన ఎన్విరాన్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. సురక్షిత, నమ్మకమైన పరిస్థితుల్లో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ గా తను ఆటగాళ్లకు అలాంటి వెదర్ ఉండేలా చూస్తానని పేర్కొన్నాడు. ఇక తమ సిసలైన ఆటతీరుపై అవగాహన వచ్చేందుకు ఆగస్టు వరకు ఆగాల్సిందేనని పేర్కొన్నాడు. ఆగస్టు తొలి వారంలో ఇంగ్లాండ్ పర్యటన ముగియబోతోంది. ఈక్రమంలో టీమిండియా ఆటతీరుపై స్పష్టత వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అరుదైన అవకాశం..ఇక టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించడమనేది లైఫ్ టైం చాన్సని, అది అందరికీ రాదని గిల్ గుర్తు చేశాడు. తన వరకు టెస్టులే ముఖ్యమని, ఈ ఫార్మాట్ లో జట్టును నడిపించడం గౌరవంగా భావిస్తానని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ కు టెస్టులకు పోలీక లేదని, ఐపీఎల్ ప్రతి ఏడాది జరుగుతుందని, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చోట్ల టెస్టులు ఆడటం సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఏడాది ఐపీఎల్లో టైటిల్ గెలిచేందుకు అవకాశం వస్తుందని, అయితే సేనా దేశాల్లో టెస్టులను గెలిచే అవకాశం ప్రతీసారి రాదని పేర్కొన్నాడు.
అరుదైన జాబితాలో నిలవాలని..ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ గెలిచిన భారత కెప్టెన్ గా నిలిచేందుకు గిల్ కు సువర్ణావకాశం లభించింది. ఇప్పటివరకు అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ సాధించిన భారత కెప్టెన్లుగా నిలిచారు. చివరిసారిగా 2007లో ఇంగ్లీష్ గడ్డపై టెస్టు సిరీస్ సాధించింది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి మేటి ప్లేయర్లు వచ్చినా, ఇంగ్లీష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోయారు. కానీ గిల్ మాత్రం కెప్టెన్సీ చేపట్టిన తొలి అసైన్మెంట్లోనే ఈ ఘనత సాధించేందుకు అవకాశం లభించింది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో ఇండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అలాగే ఈ సిరీస్ తో నే 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ లో భారత వేట కూడా ప్రారంభం కాబోతోంది.