ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. వర్షం అంతరాయం కలిగించిన మొదటి టీ20లో రెండు పరుగులతో డీఆర్ఎస్ పద్ధతిలో గెలుపు అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం భారత్ 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో డీఆర్ఎస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు.


ఐర్లాండ్ తరఫున బ్యారీ మెకార్తీ (51 నాటౌట్: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా తరఫున ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24: 23 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.


వరుణుడి ఎంట్రీతో...
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24: 23 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) శుభారంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ఐతే ఏడో ఓవర్లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలను (0: 1 బంతి) క్రెయిగ్ యంగ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అనంతరం వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. ఎంతకీ వర్షం ఆగకపోవడంతో డీఆర్ఎస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు.


అదరగొట్టిన మెకార్తీ...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్్ ఆండ్రూ బాల్‌బిర్నీ, లొరాన్ టక్కర్‌లు మొదటి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఐర్లాండ్ నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, డాక్రెల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. వీరు కూడా అవుట్ కావడంతో ఐర్లాండ్ 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కనీసం 70 పరుగులైనా చేస్తుందా అన్న తరుణంలో కర్టిస్ కాంఫర్, మార్క్ అడెయిర్ వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు 28 పరుగులు జోడించి వికెట్ల పతనాన్ని ఆపారు.  వీరు క్రీజులో కుదురుకుంటున్న దశలో అడెయిర్‌ను బిష్ణోయ్ పెవిలియన్ బాట పట్టించాడు.


ఆ తర్వాత కర్టిస్ కాంఫర్‌కు బ్యారీ మెకార్తీ జత కలిశాడు. ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరు అయినా సాధించిందంటే అది వీరిద్దరి చలవే. వీరు ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కాంఫర్ అవుటయినా బ్యారీ మాత్రం చివరి వరకు క్రీజులో ఉన్నాడు.


Also Read: విరాట్‌ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!



Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్‌ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial