Jasprit Bumrah: 


పదేళ్ల తర్వాత ఇంటి వద్ద వేసవి కాలాన్ని గడిపానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అంటున్నాడు. సుదీర్ఘ కాలం దూరమవ్వడాన్ని నెగెటివ్‌గా తీసుకోలేదన్నాడు. తానిప్పుడు సేదతీరానని ఆటను ఆస్వాదించేందుకే వచ్చానని వెల్లడించాడు. తన నుంచి ఎక్కువగా ఆశించొద్దని స్పష్టం చేశాడు. తనపై అంచనాలు పెట్టుకోవడం ఇతరుల సమస్యగా వర్ణించాడు. ఐర్లాండ్‌తో (India vs Ierland) మొదటి టీ20కి ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.


'నేనేమీ వెనక్కి తగ్గలేదు. ఎప్పట్లాగే బంతులు విసురుతున్నా. నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. చాలాసార్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేశాను. రిహాబిలిటేషన్‌ ముగిశాక ఇంటికెళ్లాను. అహ్మదాబాద్‌లో గుజరాత్ జట్టుతో కలిసి సాధన చేశాను. చాలా ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడాను. నాపై ఎలాంటి ఆంక్షలు లేవు. టీమ్‌ఇండియాతో డబ్లిన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ బౌలింగ్‌ను ఇంకాస్త ఎక్కువే ఎంజాయ్‌ చేయొచ్చు. నా బాడీ చాలా బాగుంది. ఎక్కువ మ్యాచులు ఆడేందుకు ప్రయత్నిస్తాను' అని బుమ్రా అన్నాడు.


బెంగళూరులోని ఎన్‌సీఏలో బుమ్రా వన్డేల కోసమే ఎక్కువగా సాధన చేశాడు. రోజుకు 10, 15 మించి ఓవర్లు వేశాడు. ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో పాల్గొన్నాడు. 'మేం తెలివిగా ప్రిపేరయ్యాం. వన్డే ప్రపంచకప్‌కు ముందు టెస్టు షెడ్యూలు లేదు. అలాగే టీ20 మ్యాచుల్ని పట్టించుకోలేదు. వన్డేలనే దృష్టిలో పెట్టుకొని పది ఓవర్లు వేయడమే లక్ష్యంగా సాధన చేశాను. రోజుకు 10, 12, 15 ఓవర్ల వరకు విసిరాను. అందుకే ఐర్లాండ్‌లో అంతకన్నా తక్కవ ఓవర్లు వేయడం చాలా సులభం' అని బుమ్రా అన్నాడు.


'జస్ప్రీత్‌ బుమ్రా టీమ్‌ఇండియా బౌలింగ్ ట్రంప్‌ కార్డు అనుకోవడం గొప్ప గౌరవం. మంచైనా చెడైనా దీనిని నేను గౌరవిస్తాను. అయితే ఎక్కువ సీరియస్‌గా తీసుకోను. నాపై అంచనాల భారం, ఒత్తిడిని ఉంచుకోను. నేనూ వాస్తవానికి దూరంగా అంచనాలు పెట్టుకోను. ఇంత సుదీర్ఘ కాలం నేనెప్పుడూ ఆటకు దూరమవ్వలేదు. ఇది చేస్తా అది చేస్తా అనుకోలేదు. వీలైనంత వరకు సేవ చేయాలనే భావించాను. ఆటను ఎంజాయ్‌ చేయడానికే పునరాగమనం చేస్తున్నాను' అని బుమ్రా తెలిపాడు.


'కొన్ని సార్లు గాయాల నుంచి కోలుకోవడం ఆలస్యమవుతుంది. ఇది చికాకు పెడుతుంది. అయితే అనుమానం పెట్టుకోవడం కన్నా ఆలోచనా దృక్పథం మార్చుకోవడం మంచిది. త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఆటకు విరామం రావడం చీకటి రోజులుగా భావించలేదు. అతిగా ఆలోచించకుండా నా చేతుల్లో ఉన్న పరిష్కారాన్నే అమలు చేశాను. 10-11 ఏళ్ల తర్వాత తొలిసారి ఎండాకాలం ఇంటివద్ద ఉన్నాను. మిత్రుల్ని కలిశాను. కుటుంబంతో సేదతీరాను. ఒకరకంగా ఇది మంచే చేసింది. ఇప్పుడు ట్రైనింగ్‌ను ఆస్వాదిస్తున్నాను' అని బుమ్రా చెప్పాడు.


IND vs IRE T20 సిరీస్‌ పూర్తి షెడ్యూలు


ఆగస్టు 18, 2023: డబ్లిన్‌లో  మొదటి టీ20
ఆగస్టు 20, 2023: డబ్లిన్‌లో రెండో టీ20
ఆగస్టు 23, 2023: డబ్లిన్‌లో మూడో టీ20


IND vs IRE T20 సిరీస్‌కు భారత జట్టు


జస్ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్షదీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌