Virat Kohli:
పరుగుల యంత్రం.. ఛేదన రారాజు.. కింగ్.. ఏలియన్! అతడి ఆటకు ముగ్ధులైన అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేర్లు ఇవి. అతడు క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి ఎవరైనా బెంబేలెత్తాల్సిందే! అతడు బ్యాటుతో సొగసైన కవర్‌డ్రైవ్‌లు ఆడితే అపోజిషన్ బౌలర్లకూ నేత్రానందం కలుగుతుంది!
అతడు వికెట్ల మధ్య పరుగులు తీస్తుంటే జమైకా చిరుతను తలపిస్తాడు. మైదానంలో అతడి సంబరాలు సింహనాదాలను గుర్తుకు తెస్తాయి. విచిత్రంగా అతడు హాఫ్ సెంచరీలు కొట్టినా స్టాండర్డ్స్ అందుకోవడం లేదని విమర్శలు వస్తుంటాయి. అతడే విరాట్ కోహ్లీ (Virat Kohli)! ఆగస్టు 18కి కింగ్ మైదానంలోకి దిగి 15 ఏళ్లు.
🏏 విరాట్ కోహ్లీ తన 15 ఏళ్ల కెరీర్లో వికెట్ల మధ్య ఏకంగా 510 కిలోమీటర్లు పరుగెత్తాడు. అతడు 277 కిలోమీటర్లు పరుగెత్తగా.. సహచరుల కోసం మరో 233 కిలోమీటర్లు ఉరికాడు. క్రికెట్ చరిత్రలో అతడిలా పరుగులు తీసిన ఆటగాడు మరెవ్వరూ లేరు. తన సహచరులతో కలిసి ఏకంగా 25,354 రన్స్ తీశాడు.
🏏 ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో విరాట్ కోహ్లీ అత్యంత విజయవంతమైన బ్యాటర్. 2014, 2016 టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఛేదనల్లో అతడి రికార్డు ఔట్ స్టాండింగ్. అతడు ఛేదనకు దిగిన పదిసార్లలో తొమ్మిది సార్లు టీమ్‌ఇండియా గెలిచింది. అందులో ఎనిమిది సార్లు అతడు అజేయంగా నిలిచాడు.
🏏 పైన చెప్పిన పది ఛేదనల్లో విరాట్ కోహ్లీ సగటు 270. అతడి తర్వాతి అత్యుత్తమ సగటు 146 మార్కస్ స్టాయినిస్‌ది. అంటే అతడి కన్నా రెట్టింపు ఉంది. ఇక విజయవంతమైన ఛేదనల్లో విరాట్ సగటు 518. సెకండ్ బెస్ట్ కామెరాన్ వైట్ (104)తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ.
🏏 విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 84 వేదికల్లో ఆడాడు. అందులో 46 వేదికల్లో సెంచరీలు కొట్టాడు. అతడి 76 శతకాల్లో అడిలైడ్ ఓవల్‌లో ఏకంగా ఐదు బాదేశాడు. కేవలం సచిన్ మాత్రమే అతడికన్నా ఎక్కువ వేదికల్లో (53) సెంచరీలు కొట్టాడు.
🏏 విరాట్ కోహ్లీ ప్రపంచకప్ అరంగేట్రమూ అదుర్సే! 2011 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ కొట్టాడు. ఆ మరుసటి ఏడాదే టీ20 ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచులో హాఫ్ సెంచరీ బాదేశాడు.
🏏 ఇంటర్నేషనల్ క్రికెట్లో సొంత మైదానమంటే ఎవరికైనా ఇష్టమే! కానీ విరాట్ కోహ్లీ ప్రత్యర్థుల కంచుకోటల్లో పాగా వేస్తుంటాడు. తొమ్మిది దేశాల్లో వన్డే సెంచరీలు కొట్టాడు. టెస్టుల్లో ఏడు దేశాల్లో శతకాలు బాదేశాడు.
🏏 విరాట్ కోహ్లీ ఆరు దేశాల్లో టెస్టు, వన్డే సెంచరీలు కొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లో ఈ ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో సచిన్ తెందూల్కర్, కుమార సంగక్కరకు మాత్రమే ఇలాంటి రికార్డు ఉంది.
🏏 2018లో విరాట్ కోహ్లీ కేవలం పది వన్డే ఇన్నింగ్సుల్లోనే దాదాపుగా వెయ్యి పరుగులు చేశాడు. 197 నుంచి 206 వన్డే ఇన్నింగ్సుల మధ్య 142 సగటుతో 995 పరుగులు సాధించాడు. అంతకు ముందు డేవిడ్ వార్నర్ (857) రికార్డును బద్దలు కొట్టాడు.
🏏 ఈ ఏడాది తిరువనంతపురంలో జరిగిన వన్డేలో శ్రీలంకపై కోహ్లీ 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమ్‌ఇండియా 50 ఓవర్లకు 390 పరుగులు చేసింది. అయితే లంకేయులు 73కే ఆలౌట్ అయ్యారు. కోహ్లీ కన్నా 93 పరుగుల వెనకబడ్డారు. మొత్తం 317 రన్స్ తేడాతో ఓడారు.
🏏 2016కు ముందు విరాట్ కోహ్లీ 41 టెస్టుల్లో 11 సెంచరీలే చేశాడు. కేవలం ఒకే ఒక్కసారి 150 మైలురాయి దాటాడు. ఏడుసారలు 120కి లోపే ఔటయ్యాడు. 2016-19 మధ్య 15 సెంచరీలను 7 డబల్ సెంచరీలుగా మలిచాడు.
🏏 వరుసగా నాలుగు టెస్టు సిరీసుల్లో డబుల్ సెంచరీల కొట్టిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. 2016-17 మధ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌పై చేశాడు.
🏏 విరాట్ కోహ్లీ 2013లో టీమ్‌ఇండియా తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. జైపుర్‌లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లోనే చేశాడు. అదే సిరీసులో నాగ్‌పుర్‌లో 61 బంతుల్లో బాదేశాడు. ఈ రెండు మ్యాచుల్లో 25వ ఓవర్ తర్వాతే అతడు క్రీజులోకి వచ్చాడు.
🏏 కింగ్ కోహ్లీ వన్డే ఛేదనల్లో ఇప్పటి వరకు 26 సెంచరీలు కొట్టాడు, సచిన్ చేసిన 17 కన్నా తొమ్మిది ఎక్కువ. ఇవన్నీ 300 ప్లస్ టార్గెట్ ఉన్నప్పుడే వచ్చాయి. ప్రస్తుతం ఈ విభాగంలో కోహ్లీకి సమీపంలో ఉన్న పోటీదారు జేసన్ రాయ్. 300 ప్లస్ ఛేదనల్లో నాలుగు సెంచరీలు కొట్టాడు.
🏏 విరాట్ కోహ్లీ లెజిట్‌మేట్ డెలివరీ వేయకముందే వికెట్ పడగొట్టాడు. 2011లో అతడు వేసిన వైడ్‌బాల్‌కు కెవిన్ పీటర్సన్‌ను ధోనీ స్టంపౌట్ చేశాడు. టీ20ల్లో సున్నా బంతికే వికెట్ తీసిన ఏకైక బౌలర్ అతడే.
Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!